![]() |
![]() |

"మన ముందుకు రాగానే ఆయన్ను చూసి మనకు భయమేస్తుంది. ఆయన మనతో చనువుగా మాట్లాడితే ఇంకా భయమేస్తుంది. ఇంత సాధించిన మనిషి పక్కన నిలబడే అర్హత ఉందా మనకు అనిపిస్తుంది." అంటూ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మంకు నివాళులర్పించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. శుక్రవారం (జూన్ 4) బాలు 75వ జయంతి. ఆయన మననుంచి భౌతికంగా దూరమయ్యాక వచ్చిన మొదటి జయంతి. ఈ సందర్భంగా తెలుగుచిత్ర పరిశ్రమ వర్చువల్‌గా జయంత్యుత్సవాల్ని జరుపుతోంది. ఈ సందర్భంగా బాలు గురించి త్రివిక్రమ్ మాట్లాడారు.
"లైవ్ ఆర్కెస్ట్రాలో పాడటం అనే సంప్రదాయం పోయిన తర్వాత నేను సినిమాలు తీయడం మొదలుపెట్టాను. అందువల్ల ఆ మజా నాకు నిజంగా తెలీదు. దాన్ని నేను మిస్ అవుతున్నందుకు ఎప్పుడూ రిగ్రెట్ అవుతూనే ఉంటా. ఆయనతో నాకున్న పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్.. 'అతడు' సినిమాలో నాజర్ క్యారెక్టర్‌కు బాలుతో డబ్బింగ్ చెప్పించాను. ఆయన కమల్ హాసన్‌కు తప్ప వేరేవాళ్లకు చెప్పడం మానేశారు. నిజం చెప్పాలంటే ఆయన స్థాయిది కాకపోయినా నేనడిగాననీ, నా సినిమాలంటే ఇష్టం కాబట్టి నా కోసం కోదండపాణి ల్యాబ్‌లోనే డబ్బింగ్ చెప్పారు. నేను మద్రాస్ వెళ్లి ఆయనతో చెప్పించాను. కేవలం రెండు గంటల్లో డబ్బింగ్ చెప్పేశారు. అప్పుడు ఆయనతో నేను గడిపిన రెండున్నర గంటలు ఎప్పటికీ మరచిపోలేను. ఆయనంటే గౌరవం వల్ల అనుకుంటా, ఆయన నుంచి ఎక్కువ నేను తీసుకోలేకపోయాననిపిస్తుంది. అదొక్కటే నాకు బాధనిపించే అంశం."
"బాలుగారు ఉన్నప్పుడు చాలామంది పాటలు పాడారు. తర్వాత కూడా చాలామంది పాటలు పాడతారు. ఆయనలా డబ్బింగ్ చెప్తారు, యాక్టింగ్ చేస్తారు. ఆయనలోని విలక్షణమైన అంశం ఏమిటంటే.. సినిమాను ఆయన అర్థం చేసుకున్న విధానం. సినిమా క్రాఫ్ట్ మీదున్న అండర్‌స్టాండింగ్.. ఆ అండర్‌స్టాండింగే ఆయనను ఇక్కడదాకా తీసుకొచ్చింది. ఆయనది మామూలు ఇంటలిజెన్స్ కాదు. మైక్‌కు ఎంత దూరం నుంచి మాట్లాడితే, ఏ యాంగిల్‌లో మాట్లాడితే ఎలాంటి సౌండ్ వస్తుందనే ఇంటలిజెన్స్ ఆయనది. ఆయనకెప్పుడూ ఖాళీ అనేది రాలేదు. చనిపోయే ముందు దాకా కూడా పనిచేస్తూనే ఉన్నారు. గత పదిహేనేళ్లుగా ఆయన చేసిన గొప్ప పని యంగ్ టాలెంట్స్‌ను కనిపెట్టడం. ఇవాళ సౌత్ ఇండియాలో పాటలు పాడుతున్నవారిలో 60 శాతం మంది ఆయన దగ్గర్నుంచి వచ్చినవాళ్లే. వాళ్లే ఇవాళ దక్షిణ భారత సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆయన దగ్గర్నుంచి వెళ్లిన కొంతమంది ఇండియన్ ఐడల్ లాంటి పోటీల్లో పాల్గొని గెలిచారు. అంటే జాతీయ స్థాయిలోనూ ఆయన శిష్యులు ఉన్నారు. అలా తన తర్వాతి తరాల్ని కూడా ఆయన గెలిపించారు."
"ఆయన్ని మనం ఎప్పటికీ మరచిపోలేం. ఆయన్ని మనం మరచిపోవడం అసంభవం. తన పాటలతో ఆయన మనతోనే ఎప్పటికీ ఉండిపోతారు. మన సంప్రదాయాలు, పద్ధతులు ఇంత బాగా తెలిసిన మనిషి చెప్పాపెట్టకుండా వెళ్లడం మాత్రం పద్ధతి కాదు. ఈ ఒక్క విషయంలోనే ఆయన మనల్ని మోసం చేశారు. ఆయన కుటుంబానికి ఒకందుకు కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లు ఆయనతో ఎక్కువగా గడపడం మిస్సయినందువల్లే మనం బాలుగారిని ఇంతగా పొందగలిగాం."
![]() |
![]() |