![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ది కళాత్మక కలయిక. కమల్ కథానాయకుడిగా విశ్వనాథ్ మూడు చిత్రాలను రూపొందించగా.. సదరు మూడు సినిమాలు (సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం) కూడా అవార్డుల పంట పండించాయి. ఇరువురికి తమ తమ శాఖల్లో ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `సాగరసంగమం` (1983). తెలుగునాట ఆల్ - టైమ్ క్లాసిక్ గా నిలిచిన ఈ సంగీతభరిత నృత్యప్రధాన చిత్రం విడుదలై ఈ జూన్ 3కి 38 వసంతాలు. ఈ సందర్భంగా.. `సాగరసంగమం`కి సంబంధించిన కొన్ని విశేషాలను ముచ్చటించుకుందాం..
సాగరసంగమం - విశేషాలు:
* ఉత్తమ సంగీత దర్శకుడు (ఇళయరాజా) - ఉత్తమ గాయకుడు (బాలు) విభాగాల్లో `జాతీయ` పురస్కారాలను, తృతీయ ఉత్తమ చిత్రం - ఉత్తమ నటుడు - ఉత్తమ గాయని (జానకి) - ఉత్తమ కళా దర్శకుడు (తోట తరణి) - ఉత్తమ ఎడిటర్ (జీజీ కృష్ణారావు) - ఉత్తమ ఆడియోగ్రాఫర్ (ఏఆర్ స్వామి నాథన్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. ఉత్తమ నటుడు - ఉత్తమ నటి (జయప్రద) - ఉత్తమ దర్శకుడు విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది `సాగరసంగమం`.
* `సాగరసంగమం` అప్పట్లో పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అదేవిధంగా CNN-IBN జాబితాలో 100 అత్యుత్తమ భారతీయ చిత్రాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది.
* బెంగళూరులోని పల్లవి థియేటర్ లో 511 రోజుల పాటు ఈ సినిమా ప్రదర్శితమైంది.
* `సాలంగ ఒలి`, `సాగరసంగమం` పేర్లతో తమిళ, మలయాళ భాషల్లో అనువాదమైన ఈ చిత్రం ఆయా భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అలాగే రష్యన్ భాషలోనూ అనువాదమై.. చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
* ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, బెంగళూరు.. ఇలా దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లోనూ 100 రోజులకి పైగా ప్రదర్శితమైన మొదటి చిత్రంగా రికార్డులకెక్కింది `సాగరసంగమం`.
* ప్రముఖ గాయని ఎస్పీ శైలజ నటించిన ఏకైక చిత్రం `సాగరసంగమం`. ఇందులో జయప్రద కూతురిగా, కమల్ హాసన్ శిష్యురాలిగా శైలజ అభినయించారు.
* ఇందులో బాలనటుడిగా నటించిన చక్రి తోలేటి.. 26 ఏళ్ళ తరువాత కమల్ హాసన్ ప్రధాన పాత్రలో `ఉన్నైపోల్ ఒరువన్`(తమిళ్), `ఈనాడు` (తెలుగు) పేర్లతో ఓ బైలింగ్వల్ మూవీని రూపొందించడం విశేషం.
* ఇళయరాజా సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నింటికీ వేటూరి సాహిత్యమందించారు. ఇందులోని ప్రతీ గీతం.. ఓ ఆణిముత్యమే.
* తను నిర్మించిన `సీతాకోకచిలక` (1981)లోని `సాగరసంగమమే` పాటలోని తొలి పదాన్నే టైటిల్ గా పెట్టి ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, బాణీకట్టిన ఇళయరాజానే స్వరాలు సమకూర్చడం మరో విశేషం.
![]() |
![]() |