![]() |
![]() |

ఈ రోజుల్లో అరుదైపోయాయి కానీ, ఆ రోజుల్లో మల్టీస్టారర్స్ రెగ్యులర్‌గా వచ్చేవి. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబినేషన్ తర్వాత కృష్ణ-శోభన్‌బాబు కాంబినేషన్‌కు కూడా అప్పుడు బాగా క్రేజ్ ఉండేది. 'లక్ష్మీ నివాసం' తర్వాత ఆ ఇద్దరూ హీరోలుగా నటించిన చిత్రం 'మంచి మిత్రులు' (1969). ఓ తమిళ సినిమాకు ఇది రీమేక్. తాతినేని రామారావు డైరెక్ట్ చేశారు. అప్పటికి ఇంకా కృష్ణ, శోభన్‌బాబు పెద్ద స్టార్లు కాదు. ఇద్దరు హీరోలున్నా అది లో-బడ్జెట్ మూవీనే. తక్కువ రోజుల్లోనే దాన్ని తీశారు నిర్మాతలు డూండీ, మల్లికార్జునరావు.
'మంచి మిత్రులు' అనగానే చాలా మందికి మొదట గుర్తుకొచ్చేది, "ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే" అనే పాట. సి. నారాయణరెడ్డి రాసిన ఈ పాటకు స్వరాలు కూర్చింది ఎస్పీ కోదండపాణి. ఘంటసాల, ఎస్పీ బాలు పాడారు. అప్పటికి ఘంటసాల మోస్ట్ పాపులర్ సింగర్ కాబట్టి, ఆయన తనకు పాడితే బాగుంటుందని కృష్ణ, శోభన్ ఇద్దరూ ఆశించారు. శోభన్‌బాబు డైరెక్టర్ తాతినేని రామారావుతో ఆ విషయం ప్రస్తావించి, "సార్.. మీరు కొంచెం నా విషయం చూడాలి. నా క్యారెక్టర్ బాగానే ఉంది. ఈ పాటలో నాకు ఘంటసాలగారు పాడితే బాగుంటుంది. మీరు ఆలోచించండి." అని చెప్పారు.
"అలాగేలేవయ్యా.. అదంతా మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. డూండీగారి ఇష్టం." అని వాళ్లమీదకు తోసేశారు రామారావు. కృష్ణకు నిర్మాతలు డూండీ, మల్లికార్జునరావు బాగా సన్నిహితులు. అందుకని తన పాత్రకు సరైన న్యాయం జరగదేమోననే అనుమానం శోభన్‌కు ఉండేది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి పాత్రలకూ దర్శకుడు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఆ పాటలో కృష్ణకు ఘంటసాల గాత్రం, శోభన్‌కు బాలు గాత్రం ఇప్పించారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి.
ఈ సినిమాకు సంబంధించిన ఇంకో విశేషం.. కృష్ణ చెల్లెలిగా విజయనిర్మల నటించడం. 'మంచి మిత్రులు'లో నటించినందుకు కృష్ణ అందుకున్న పారితోషికం రూ. 6 వేలు అయితే, శోభన్‌బాబుకు అందింది రూ. 7 వేలు! ఈ సినిమా 1969 జనవరి 12న విడుదలై మంచి విజయం సాధించి, ఇద్దరు హీరోలకూ మంచి పేరు తెచ్చింది.
![]() |
![]() |