![]() |
![]() |

సూపర్‌స్టార్ కృష్ణ వారసునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పెద్దకొడుకు రమేశ్‌బాబు.. 'సామ్రాట్'గా అడుగుపెట్టి, హీరోగా తన ప్రస్థానాన్ని మధ్యలోనే వదిలేసి, విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ చిన్నకొడుకు మహేశ్‌బాబు.. 'రాజకుమారుడు'గా ప్రవేశించి, 'సింహాసనా'ధీశుడైన తండ్రికి తగ్గ 'ప్రిన్స్'గా పేరుతెచ్చుకుని, ఇవాళ తండ్రికి అభిమానులిచ్చిన 'సూపర్‌స్టార్' పేరును తను సొంతం చేసుకున్నాడు. అన్న రమేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'నీడ'లో ఓ చిన్న పాత్ర పోషించడం ద్వారా వెండితెర మీదకు తొలిసారిగా వచ్చాడు మహేశ్. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చూపించాడు. 'పోరాటం' సినిమాలో నిజ జీవిత తండ్రి కృష్ణకు కుమారుడిగా నటించాడు. శంఖారావం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నాతమ్ముడు, బాలచంద్రుడు చిత్రాల్లో బాలనటుడిగా అభినయం ప్రదర్శించి, ఆ వయసులోనే సొంత ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు మహేశ్.
నటుడిగా తనకు స్ఫూర్తి తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణేనని ఎప్పుడూ చెప్పే మహేశ్, చిన్నతనం నుంచీ చూస్తూ పెరిగింది ఆయన సినిమాలే. వాటిలో తండ్రిని చూసి, ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ చూసి ఎగ్జయిట్ అయిపోయేవాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తండ్రి మీద ప్రేమను ప్రదర్శించడానికి ఉత్సాహం చూపించే మహేశ్.. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజుకు తన సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తుంటాడు. ఇప్పుడు కూడా తండ్రి 78వ బర్త్‌డే సందర్భంగా, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆయనతో కలిసున్న ఓ ఫొటోను షేర్ చేశాడు మహేశ్. దానితో పాటు, "Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know. (పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా .. నాకెప్పుడూ ఉత్తమమైన మార్గాన్నే చూపించినందుకు ధన్యవాదాలు.. మీకెప్పుడూ తెలిసిన దానికంటే దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.)" అని రాసుకొచ్చాడు.
కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటూ, ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణ. చివరిసారిగా ఆయన ముప్పలనేని శివ డైరెక్ట్ చేసిన 'శ్రీశ్రీ' (2016) సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.
![]() |
![]() |