![]() |
![]() |

`కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఇదిలా ఉంటే.. 2022 వేసవిలో లేదా ద్వితీయార్ధంలో పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఎన్టీఆర్ ఓ పొలిటికల్ లీడర్ గా దర్శనమివ్వనున్నారట. అంతేకాదు.. ఇప్పటివరకు వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్స్ కి భిన్నంగా `ఎన్టీఆర్ 31` సాగుతుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో `ఆర్ ఆర్ ఆర్` ఉంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ పిరియడ్ డ్రామా.. అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` విడుదలకు సిద్ధమైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న `సలార్` చిత్రీకరణ దశలో ఉంది. 2022 ఏప్రిల్ 14న ఈ యాక్షన్ సాగా రిలీజ్ కానుంది.
![]() |
![]() |