![]() |
![]() |

కుటుంబకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. 'శుభలగ్నం' (1994) వంటి సెన్సేషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరువాత జగపతిబాబు - ఆమని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం 'మావిచిగురు'(1996). రంజిత మరో హీరోయిన్ గా నటించిన ఈ కుటుంబకథా చిత్రంలో అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, సుబ్రమణ్యశర్మ, పీజే శర్మ, గిరిబాబు, బ్రహ్మానందం, బాబూ మోహన్, శ్రీలక్ష్మి, అలీ, శివపార్వతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో నటనకు గాను జగపతిబాబుకు మొదటి సారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించింది.
ఈ సినిమా సీత (ఆమని), మధు (జగపతిబాబు) పెళ్ళితో కథ ప్రారంభం అవుతుంది. సీతకు తన భర్తంటే ప్రాణం. అతన్ని వేరెవరైనా ఆడపిల్ల కన్నెత్తి చూసినా సహించలేదు. మధు పనిచేసే ఆఫీసులోనే సుధ (రంజిత) అనే అమ్మాయి సీత చూస్తుండగానే భర్తను కౌగలించుకుంటుంది. దాంతో సీత భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో ఆమెకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. తన చనిపోతే భర్త ఒంటరి కాకూడదని తన పరిస్థితి భర్తకు చెప్పకుండానే అతనికి సుధకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె భర్తను సాధిస్తూ అతన్నుంచి వేరు పడాలని చూస్తుంది. కానీ మధు ఒప్పుకోడు. చివరికి అతనితో విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. సీతకున్న జబ్బు గురించి తెలుసుకుని తనమీద భార్యకున్న ప్రేమ కోసం సుధను పెళ్ళి చేసుకుంటాడు మధు. సీత మరణిస్తుంది. తర్వాత పుట్టిన కూతురికి సీత అని పేరు పెట్టుకుంటారు మధు, సుధ.
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. "కోదండరాముడంట", "మావిచిగురు తిని", "కొమ్మన కులికే", "మాట ఇవ్వమ్మా చెల్లి", "కొండమల్లి కొండమల్లి", "రంజు భలే రాంచిలక".. ఇలా ఇందులోని గీతాలన్ని అలరించాయి. మలయాళంలో 'కుంకుమచ్చెప్పు', తమిళంలో 'తొడరుమ్' పేర్లతో రీమేక్ అయిన 'మావిచిగురు' చిత్రాన్ని స్రవంతి మూవీస్ సమర్పణలో చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై పి. ఉషారాణి నిర్మించారు. 1996 మే 30న విడుదలై అఖండ విజయం సాధించిన 'మావిచిగురు'.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |