![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ 'శ్రీరామ దండకం'ను ఆలపించారు. తన తండ్రి, మహానటుడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆ పరమ పవిత్ర దండకాన్ని సమర్పించారు. దానిని తండ్రికే అంకితం ఇచ్చారు. తన సొంత యూట్యూబ్ చానల్ ఎన్‌బీకే ఫిలిమ్స్ ద్వారా ఆ దండకంను నేడు విడుదల చేశారు.
"వెండితెరమీదున్న కథానాయకుడ్ని ఆబాలగోపాలానికి ఆరాధ్యుడ్ని చేసిన ఆది అధినాయకుడు, తన పేరులోనే ఉన్న తారాస్థాయిని తన జీవిత సహచరిగా నడిపించిన తారకరాముడు, తెలుగు ఉనికిని నేల నలుచెరుగులా నినదించిన జగదభిరాముడు, తెలుగు గడప రంగు జెండాని ప్రతి గుండెలో ఎగురవేసిన కోదండరాముడు, పేదవారి వెన్నపూస, తెలుగుజాతి వెన్నుపూస మా నాన్నగారు, మీ అందరి అన్నగారు జన్మించి 98 ఏళ్లు పూర్తయి, 99వ ఏడు ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం శత జయంత్యోత్సవం జరుపుకోనున్న శుభ సందర్భంగా ఆ మహనీయునికి, ఆ తారకరామునికి అంకితం ఈ శ్రీరామ దండకం." అంటూ ఆయన దండకాన్ని ప్రారంభించారు.
'శ్రీరామదండకం'ను బాలకృష్ణ ఆలపించినంత సేపూ 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) చిత్రంలో శ్రీరామచంద్రమూర్తిగా ఎన్టీఆర్ స్టిల్స్‌నూ, సన్నివేశాలనూ చూపించారు.
బాపు దర్శకత్వం వహించిన 'శ్రీ రామాంజనేయ యుద్ధం'లో శ్రీరామునిగా ఎన్టీఆర్, సీతాసాధ్విగా బి. సరోజాదేవి, ఆంజనేయస్వామిగా అర్జా జనార్దనరావు నటించారు.
![]() |
![]() |