![]() |
![]() |

`యముడు` చుట్టూ తిరిగే ఫాంటసీ కథలతో రూపొందిన పలు తెలుగు చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిలో `యమలీల` ఒకటి. అప్పటివరకు హాస్యనటుడిగా ఉన్న అలీని కథానాయకుడిగా మార్చిన సినిమా ఇది. అప్పటికే వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఖాతాలో చేరిన మరో ఘనవిజయం ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో `మదర్ సెంటిమెంట్` హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
యముడుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం వినోదాలు పంచిన ఈ సినిమాలో `అమ్మ` పాత్రలో మంజుభార్గవి తన అభినయంతో అలరించారు. ప్రత్యేక గీతంలో సూపర్ స్టార్ కృష్ణ తన చిందులతో కనువిందు చేశారు. ఇంద్రజ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, ఏవీయస్, లతాశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``సిరులొలికించు``, `నీ జీనూ ఫ్యాంటు చూసి బుల్లోడో`` గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇక కృష్ణ, పూజపై చిత్రీకరించిన ``జుంబారే`` సాంగ్ కూడా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీలో `తఖ్ దీర్ వాలా` (విక్టరీ వెంకటేశ్, రవీనా టాండన్), తమిళంలో `లక్కీ మ్యాన్` (కార్తిక్, సంఘవి) పేర్లతో రీమేక్ అయిన ఈ సినిమాని మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిశోర్ రాఠి, కె. అచ్చిరెడ్డి నిర్మించారు. 1994 ఏప్రిల్ 28న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `యమలీల`.. నేటితో 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |