![]() |
![]() |
.jpg)
'హిట్'.. 2020లో అనూహ్య విజయం సాధించిన సినిమా. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌తో శైలేష్ కొలను డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి హీరో నాని ఈ మూవీని నిర్మించాడు. 'హిట్: ద ఫస్ట్ కేస్' సినిమా సక్సెస్ మీట్‌లో దీనికి సీక్వెల్ ఉంటుందని శైలేష్ కొలను, నాని ఇద్దరూ చెప్పారు. విష్వక్ సేన్ సైతం దానిలో హీరోగా నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
అయితే కొంత కాలంగా 'హిట్' సీక్వెల్‌లో హీరో మార్పు గురించి ప్రచారం జరుగుతూ వచ్చింది. దాన్ని నిజం చేస్తూ 'హిట్: ద సెకండ్ కేస్'లో హీరోగా అడివి శేష్ ఎంపికయ్యాడు. శనివారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శైలేష్‌కు అందించాడు. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు.
క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శేష్.. ప్రస్తుతం టెర్రరిస్టులతో పోరాడి, పౌరులను కాపాడేందుకు తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో మేజర్` మూవీ చేస్తున్నాడు. కృష్ణ దేవ్ అలియాస్ కె.డి. పాత్రలో అతను నటించే 'హిట్ 2' రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్ (హోమిసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి. ఈ ఎగ్జయిటింగ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నాడు.
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించే ఈ మూవీలో రావు రమేశ్, భానుచందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ కీలక పాత్రధారులు. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకి జాన్ స్టీవర్స్ ఎడురి సంగీతాన్నీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్‌నూ సమకూరుస్తున్నారు.

![]() |
![]() |