![]() |
![]() |

తమిళనాడు ఎన్నికలు ఆసక్తికర విషయాల్ని బయటపెడుతున్నాయి. ఇటీవల కోయంబత్తూర్ సౌత్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యుమ్ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఎన్నికల అఫిడవిట్‌లో తన స్థిర చరాస్తుల గురించి వెల్లడించారు. అలాగే తన స్టడీకి సంబంధించిన వివరాల్ని కూడా వెల్లడించి షాకిచ్చారు.
తాజాగా ఇదే తరహాలో తన ఆస్తి వివరాలతో పాటు చదువుకు సంబంధించిన విషయాల్ని వెల్లడించి విస్మయానికి గురిచేస్తున్నారు నటి ఖుష్బూ. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో థౌజెండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఖుష్బూ ఎన్నికల అఫిడవిట్‌లో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తన వద్ద 8.5 కిలోల బంగారం, 75 కిలోల వెండి వున్నట్టు ప్రకటించారు.
ఇక తనకు రూ. 6.39 కోట్ల చరాస్తులు, రూ. 34.56 కోట్ల స్థిరాస్తులు సహా మొత్తం రూ. 40.96 కోట్ల విలువైన ఆస్తులు వున్నట్టు తెలిపారు. భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి వున్నట్టు ప్రకటించారు. ఇక చదువుకు సంబంధించి కూడా వెల్లడించారు. కమల్ తరహాలోనే తాను ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదివినట్లు ప్రకటించారు. దీంతో అంతా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

![]() |
![]() |