![]() |
![]() |

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్.. తెలుగులోనూ కొన్ని సినిమాలతో సందడి చేశారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'గాండీవం' (1994)లో ఓ పాటలో తళుక్కున మెరిశారు లాల్. ఆపై చాలా కాలం గ్యాప్ తరువాత 'మనమంతా', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా 2016లోనే నెల రోజుల వ్యవధిలో జనం ముందుకు వచ్చాయి.
కట్ చేస్తే.. ఐదేళ్ళ విరామం అనంతరం మోహన్ లాల్ మరో తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సోషల్ డ్రామా రాబోతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ టచ్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ముఖ్యమంత్రి పాత్రలో లాల్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే కొరటాల రూపొందించిన 'జనతా గ్యారేజ్'లో నటించారు మోహన్ లాల్. ఈ అనుబంధంతోనూ, పాత్ర నచ్చడంతోనూ.. లాల్ కూడా వెంటనే అంగీకారం తెలిపారని సమాచారం.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |