![]() |
![]() |

ఇవాళ ఊర్మిళ మతోంద్కర్ బర్త్‌డే. ఆమెకు 47 సంవత్సరాలు నిండాయంటే ఒక పట్టాన నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. ఊర్మిళ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా 'రంగీలా'. రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ఆ సినిమాతో ఊర్మిళ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ మూవీలో ఆమె లుక్స్, పర్ఫార్మెన్స్, డాన్సులు కుర్రకారును వెర్రెత్తించాయి. ఫలితంగా యూత్‌కు ఆమె కలల రాణిగా మారిపోయింది.
1977లో 'కర్మ్' అనే హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసింది ఊర్మిళ. అంటే నటిగా ఆమె వయసు 44 సంవత్సరాలు! 1992లో ఆర్జీవీ డైరెక్ట్ చేసిన 'అంతం' చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించడం ద్వారా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అయ్యింది ఊర్మిళ. ఆ సినిమా ఫ్లాపైనా తన అందచందాలతో ఆకట్టుకుంది. అయితే ఆర్జీవీనే రూపొందించిన 'గాయం' సినిమా హిట్టవడంతో ఆమెకు టాలీవుడ్‌లోనూ క్రేజ్ వచ్చింది. అందులో జగపతిబాబు జోడీగా దర్శనమిచ్చింది ఊర్మిళ.
ఇవన్నీ ఒకెత్తయితే 1995లో వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ 'రంగీలా' ఆమె కెరీర్‌ను సమూలంగా మార్చేసింది. ఇప్పటికీ ఆ సినిమానీ, అందులోని టైటిల్ సాంగ్‌నీ ఆడియెన్స్ మర్చిపోలేదు. ఇప్పుడు పెద్దవాళ్లయిన ఆనాటి కుర్రకారు 'రంగీలా'లో ఊర్మిళను ఇప్పటికీ తలుచుకుంటూ తన్మయత్వం చెందుతుంటారు. ఆ మూవీలో ఆమె చేసి మిలీ జోషి పేరును కూడా ఇప్పటికీ వారు మరచిపోలేదు.
అయితే ఆ క్యారెక్టర్‌కు ఊర్మిళ ఫస్ట్ చాయిస్ కాదనే విషయం మీకు తెలుసా? అవును. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ స్వయంగా వెల్లడించింది. తాను చేసిన మిలీ, ఆమిర్ ఖాన్ చేసిన మున్నా క్యారెక్టర్లకు రామ్‌గోపాల్ వర్మ ఫస్ట్ చాయిస్ శ్రీదేవి, నాగార్జునలని చెప్పింది ఊర్మిళ. అలాగే జాకీ ష్రాఫ్ క్యారెక్టర్‌ను ఓ తమిళ స్టార్ చేయాల్సి ఉండగా, ఆయన తప్పుకున్నాడనీ, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి శ్రీదేవి కూడా తప్పుకున్నారని వెల్లడించింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు తప్పుకోవడంతో, చివరకు ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, తాను నటించామని చెప్పుకొచ్చింది ఊర్మిళ.
ఏదేమైనా సూపర్ స్టార్ శ్రీదేవి చేయాల్సిన 'రంగీలా' హీరోయిన్ క్యారెక్టర్‌ను దక్కించుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎవర్‌గ్రీన్ బ్యూటీ ఊర్మిళ.

![]() |
![]() |