![]() |
![]() |

తెలుగింటి ఆడపడుచు, సీనియర్ నటి సుమలత, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్‌గా పేరుపొందిన అంబరీష్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన సుమలత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, యంగ్ హీరో నిఖిల్‌కుమార్ గౌడపై పోటీచేసి గెలిచి సంచలనం సృష్టించారు. మృదు స్వభావి అయిన సుమలతకు, అందుకు పూర్తి భిన్నమైన డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం కలిగిన అంబరీష్‌కు మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా వారు ఎలా పేరు తెచ్చుకున్నారనే విషయం ఆసక్తికరం.
39 సంవత్సరాల వయసు వచ్చేవరకు అవివాహితుడిగానే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ వచ్చారు అంబరీష్. 1984లో ఆయన లైఫ్ మరో మలుపు తీసుకుంది. 'ఆహుతి' అనే సినిమాలో ఆయన హీరోగా నటించగా, ఆ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుమలత. గుంటూరులోని ఒక నాయుడు కుటుంబానికి చెందిన సుమలత 1963లో జన్మించారు. 1978లో 'కరుణామయుడు' సినిమాలో తొలిసారిగా తెరపై కనిపించారు. 'ఆహుతి'లో నటించడానికి ముందే టాలీవుడ్‌లో సుమలత హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

తన సినిమా సెట్స్‌పై ఎవరైనా నీరసంగా కనిపిస్తే అంబరీష్ సహించేవారు కాదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎనర్జీ ఉండాల్సిందే. సుమలతది రిజర్వ్‌డ్ మనస్తత్వం. అవసరమైతేనే ఎవరితోనైనా మాట్లాడేవారు. షాట్ గ్యాప్‌లో పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. అంబరీష్ మనస్తత్వం గురించి రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉండటంతో, మొదట ఆయనతో కలిసి నటించడానికి సుమలత వెనుకాడారు.

అందుకని ఆమె ఆయన విషయంలో దూరం పాటిస్తూ వచ్చారు. పరిమితంగానే ఆయనతో మాట్లాడేవారు. అయితే 1987లో 'న్యూ ఢిల్లీ' సినిమాకు మరోసారి కలిసి పనిచేసినప్పుడు ఆ ఇద్దరి మధ్య స్నేహం పెనవేసుకుని, సన్నిహితులయ్యారు. మిగతా సినీ తారలతో పోలిస్తే సుమలత నేచర్ భిన్నంగా కనిపించడంతో అంబరీష్ ఆమెపై అభిమానం, అనురాగం పెంచుకున్నారు. దాంతో 1989లో సుమలతకు తనదైన స్టైల్‌లో ప్రపోజ్ చేశారు.

ఆమెకు "రెబల్ ఇన్ ట్రబుల్" అంటూ ఓ లెటర్ ద్వారా తన ప్రపోజల్ తెలియజేశానని అంబరీష్ స్వయంగా తెలిపారు. పైకి ఎంత ఆవేశపరుడిగా కనిపించినా, ఆయనలోని నిజాయితీ, నిబద్ధత, తనపైన అనురాగాన్ని గుర్తించిన సుమలత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా హుందాగా కనిపించే అందమైన సుమలతకూ, రెబలస్‌గా కనిపించే అంబరీష్‌కూ 1991లో వివాహం జరిగింది. 27 సంవత్సరాల పాటు ఆ ఇద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతూ వచ్చింది. రెండేళ్ల క్రితం తమ పెళ్లిరోజును తమ సహ తారలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు ఆ జంట. అనుకోకుండా అనారోగ్యం బారినపడిన అంబరీష్ ఆకస్మికంగా 2018 నవంబర్‌లో కన్నుమూశారు. ఆ ఇద్దరి దాంపత్యానికి చిహ్నంగా కుమారుడు అభిషేక్ ఉన్నాడు. ఇప్పుడు సుమలతకు కుమారుడే సర్వస్వం.


![]() |
![]() |