![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ సినిమా ఫ్యాక్టరీ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'మర్డర్'. దీని విడుదలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయనీ, థియేటర్లలో చంపడానికి వస్తోందనీ తనదైన స్టైల్‌లో వ్యాఖ్యానించారు వర్మ. అమృత, ప్రణయ్‌ల జీవితం ఆధారంగా, ప్రణయ్ హత్య నేపథ్యంలో తీసిన సినిమాగా ఇది ప్రచారంలోకి రావడంతో, ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ అమృత మామయ్య బాలస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్ మూవీని నిర్మించారనీ, ట్రైలర్, సాంగ్‌లో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించారనీ అమృత కూడా తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేశారు. దీంతో విచారణ ముగిసేంత వరకు సినిమాను విడుదలను ఆపాలని సినిమా టీమ్‌ను కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం అమృత, ప్రణయ్, తదితరుల పేర్లు ఉపయోగించుకుండా విడుదల చేసుకోవచ్చని తెలియజేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ను రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
'మర్డర్' మూవీ విడుదలకు సంబంధించిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ను ఆయన పోస్ట్ చేశారు. మూవీకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చినట్లు దానిలో ఉంది. దాంతో పాటు "All Hurdles cleared for MURDER release. Coming to kill in theatres" అంటూ వర్మ రాసుకొచ్చారు. ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తండ్రీ కూతుళ్లుగా ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు.

![]() |
![]() |