![]() |
![]() |

ఒక సినిమా విజయంలో దాని టైటిల్ ముఖ్యపాత్ర వహిస్తుందనేది నిజం. ఈ మధ్య వస్తున్న సినిమాలకు కథతో సంబంధం లేకపోయినా టైటిల్స్, తద్వారా సినిమాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఉదాహరణకు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో, భీష్మ, అర్జున్ సురవరం, సైరా.. నరసింహారెడ్డి లాంటివి.
కొన్ని సినిమాల పేర్లు వింటే.. కథకు కొంచెం కూడా అతకని ఈ పేరెందుకు పెట్టారా అని సగటు ప్రేక్షకుడు ఆలోచనలో పడిపోతాడు. ఈ వింత పరిస్థితి కొన్ని ప్రత్యేకమైన, గంభీరమైన టైటిల్స్ చూస్తే వస్తుంది. అవి.. రూలర్, తిప్పరా మీసం, గద్దలకొండ గణేష్, సాహో, మహర్షి, సవ్యసాచి, వీరభోగ వసంతరాయలు లాంటివి.
అయితే మరో వింత.. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఏ లాయర్లో, డాక్టర్లో, పోలీసులో అయితే మరి చెప్పనవసరం లేదు. పేరు కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. వకీల్ సాబ్, లాయర్ విశ్వనాథ్, లాయర్ సుహాసిని, లాయర్ భారతీదేవి, జస్టిస్ చౌదరి, జస్టిస్ చక్రవర్తి, జస్టిస్ రుద్రమదేవి, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్ రుద్ర, రౌడీ ఇన్‌స్పెక్టర్, కెప్టెన్ నాగార్జున లాంటివి ఈ కోవకు చెందుతాయి.
అలాగే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పేర్లు.. పులి, ఒక్కడు, మగధీర, లెజెండ్, దమ్ము, రేసుగుర్రం లాంటివి. కొన్ని మూసపేర్లు వింటే మనకే చికాకు కలుగుతుంది. కలియుగ కృష్ణుడు, కలియుగ కర్ణుడు, కలియుగ అభిమాన్యుడు, కొండవీటి సింహం, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, బొబ్బొలి పులి, బొబ్బిలి సింహం, బొబ్బిలి రాజా, బొబ్బిలి దొర, పల్నాటి సింహం, పల్నాటి పులి, పల్నాటి రుద్రయ్య, పలనాటి బ్రహ్మనాయుడు లాంటివి. ఇవన్నీ ముందుగా టైటిల్ నిర్ణయించుకొని తర్వాత కథ రాశారనిపిస్తుంది.
ఇంకో తరహా ముద్దుల పేర్లు ఉంటాయి. ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, ముద్దుల ప్రియుడు, ముద్దుల మనవరాలు, ముద్దుల కొడుకు లాంటివన్న మాట. ఈ ముద్దుల గోలకు హద్దు ఉండదనిపిస్తుంది. మొగుడు, అల్లుడు పేర్లతో, రౌడీ పేర్లతో వచ్చిన సినిమాలెన్నో ఉన్నాయి.
సినిమాల్లో కొత్తదనం చూపినా, చూపకపోయినా కనీసం టైటిల్స్‌లో అయినా కొత్తదనం చూపవచ్చు కదా.. అనేది ప్రేక్షకుల ఫిర్యాదు. అందుకేనేమో ఇటీవల.. ఇస్మార్ట్ శంకర్, అరవింద సమేత వీరరాఘవ, హలో గురూ ప్రేమకోసమే, టాక్సీవాలా, పడిపడి లేచే మనసు, బ్లఫ్ మాస్టర్, ఆర్ఎక్స్ 100 లాంటి టైటిల్స్‌తో సినిమాలు వచ్చాయి.
![]() |
![]() |