![]() |
![]() |

సాధారణంగా అమ్మాయిలు తెల్లచీర కట్టుకుని, తలనిండా పూలు పెట్టుకొని, చేతిలో పాలగ్లాసుతో ఎక్కడ కనిపిస్తారు? మన సినిమాల్లో చూపించినట్లు శోభనం గదిలో! కానీ ఓ సినిమాలో ఓ అమ్మాయి శోభనం కూతురిలా అలంకరించుకొని భర్త కోసం కాకుండా విటుని కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుంది. ఆ సినిమా 'హైదరాబాద్' అయితే, ఆ అమ్మాయిగా కనిపించేది రవళి! పెళ్లి సందడిలో జాంపండులా కనిపించిన రవళి, అప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన వేశ్య పాత్రలో 'హైదరాబాద్' మూవీలో మనకు దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆ పాత్రలో సహజత్వం కనిపించడం కోసి రవళి మేకప్ వేసుకోకపోవడం గమనార్హం. అంతకు ముందు 'ఈశ్వర్ అల్లా' లాంటి సామాజిక చిత్రానికి దర్శకత్వం వహించిన అయ్యప్పశర్మ (సాయికుమార్ తమ్ముడు) ఈ సినిమాను రూపొందించారు. మరో విశేషమేమంటే ఈ సినిమాని నిర్మించింది దివంగత ఫైట్ మాస్టర్, చిరంజీవి స్టార్ హీరోగా రూపుదాల్చడంలో కీలక పాత్ర వహించిన రాజు మాస్టర్. ఇందులో హీరోగా నటించిన శివచరణ్ ఆయన కుమారుడే. రాజు మాస్టర్‌తో పాటు ఆయన శిష్యులైన నర్సింగ్ యాదవ్, రమణ్ పంజాబీ ఈ సినిమాని నిర్మించారు.
పల్లె నుంచి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చిన ఓ యువకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఒక వేశ్య పరిచయం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో ఈ సినిమాలో మనం చూస్తాం. 2001 నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవళి నటన కోసమైనా ఈ సినిమాని చూడాలి.
![]() |
![]() |