![]() |
![]() |

వర్షాలకు, వరదలకు బతుకు ఆగమాగమైన హైదరాబాదీలను ఆదుకొనే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్, మహేశ్, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి పలువురు స్టార్లు విరాళాలు ప్రకటించారు. ప్రభాస్ రూ. 1.5 కోట్లు, మహేశ్ రూ. 1 కోటి, చిరంజీవి రూ. 1 కోటి, జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్ష, రవితేజ, విజయ్ దేవరకొండ చెరో రూ. 10 లక్షలు ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, "గడచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణనష్టంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ "వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లోని పలువురి జీవితాలు ధ్వంసమయ్యాయి. మన నగరం పునరావాసం దిశగా తెలంగాణ సీఎం సహాయనిధికి నేను రూ. 50 లక్షలు అందిస్తున్నాను. మనందరం కలిసి హైదరాబాద్‌ను పునర్నింర్మించుకుందాం" అని ట్వీట్ చేశాడు.
విజయ్ దేవరకొండ తన డొనేషన్ రూ. 10 లక్షలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్‌చేసి, ఇతరులను కూడా విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. "కేరళ కోసం మనం కలిసి వచ్చాం.. చెన్నై కోసం కలిసి వచ్చాం.. ఆర్మీ కోసం కలిసి వచ్చాం.. కరోనా కాలంలో ప్రతి ఒక్కరి కోసం భారీ సంఖ్యలో కలిసి వచ్చాం.. ఇప్పుడు మన నగరం, మన ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు" అని రాసుకొచ్చాడు.
ఎడతెరపిలేని వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 37 వేలకు పైగా కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. హైదరాబాద్‌లోని వరద బీభత్సానికి గురైన కుటుంబాలకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు తక్షణ పరిహారంగా రూ. 10 వేలు ప్రకటించారు. అదనంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ. లక్ష పరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు.
![]() |
![]() |