![]() |
![]() |

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలు వస్తే... నాలుగు గోడల మధ్య పరిష్కారం అవుతాయి. కథలు కాపీ చేశారని కొందరు మీడియాకి ఎక్కి తమ వాదన వినిపించడం మినహా... డబ్బు గురించి హీరోల మీద నిర్మాతలు, నిర్మాతల మీద హీరోలు కోర్టులకు వెళ్లిన సందర్భాలు అరుదు అనే చెప్పుకోవాలి. ఏవో ఒకటి అరా మినహా నగదు లావాదేవీలకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. తమిళనాడులో వ్యవహారం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. హీరోల మీద నిర్మాతలు కోర్టుల్లో కేసులు వేస్తారు. గతంలో అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ మీద కేసు వేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా విశాల్‌కి వ్యతిరేకంగా ఆయనతో ‘యాక్షన్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు చెన్నై హైకోర్టుకు వెళ్లారు.
సుందర్ సి. దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా ‘యాక్షన్’. నిర్మాతలు వెర్షన్ ప్రకారం... వాళ్లు తక్కువ బడ్జెట్లో తీయాలని అనుకున్నారట. కానీ, విశాల్ ‘ఈ సినిమా రూ. 20 కోట్లు వసూలు చేయకపోతే నష్టాన్ని నేను భరిస్తా’ అని హామీ ఇవ్వడంతో రూ. 44 కోట్లు ఖర్చుపెట్టి భారీగా తీశామన్నారు. తీరా విడుదలైన తర్వాత తెలుగు, తమిళ భాషల్లో దగ్గర దగ్గర 12 కోట్లు వసూలు చేసిందట.
నష్టాల గురించి విశాల్‌తో చెప్పగా... ‘చక్ర’ సినిమా తమ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్‌లో నిర్మిస్తానని చెప్పి, ఇప్పుడు సొంత సంస్థలో చేసుకుంటున్నాడని ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేతలు కోర్టుకు వెళ్లారు. తీర్పు వాళ్లకు అనుకూలంగా వచ్చింది. నిర్మాతలకు రూ. 8.29 కోట్లు చెల్లించమని న్యాయమూర్తి ఆదేశించారు. దీనిపై విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |