![]() |
![]() |

బైకుల్లా జైలు నుంచి రిలీజై ఇంటికి వచ్చిన ఒక రోజు తర్వాత ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో తొలిసారి ప్రత్యక్షమైంది రియా చక్రవర్తి. హైకోర్టు విధించిన బెయిల్ నిబంధనల్లో ఒకదాని ప్రకారం రియా తన ఇంటికి సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎప్పుడైనా హాజరై, తను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలియజేయాలి. ఈ ప్రోటోకాల్‌ను రిలీజైన 10 రోజుల పాటు రియా పాటించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా గురువారం ఆమె తన నివాసం సమీపంలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు హాజరైంది.
జైలులో రియా 28 రోజుల పాటు సాధారణ ఖైదీలాగే గడిపిందని సమాచారం. ఆమె యోగా చేయడంతో పాటు తోటి ఖైదీలకు యోగా క్లాసులు తీసుకుందని ఆమె లాయర్ సతీశ్ మనేషిండే తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఆమెకు ఇంటి నుంచి భోజనం అందజేయలేదనీ, జైలులో పెట్టిన భోజనాన్నే తింటూ వచ్చిందని కూడా ఆయన చెప్పారు.
పది రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో హాజరు వేయించుకోవడంతో పాటు రూ. లక్ష రూపాయల పూచీకత్తుతో రియాకు బెయిల్ లభించింది. అలాగే దర్యాప్తు సంస్థకు తన పాస్‌పోర్ట్‌ను అందజేయడమే కాకుండా, ఆరు నెలల పాటు ప్రతి నెలా మొదటి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య దర్యాప్తు సంస్థ ఆఫీసుకు హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
![]() |
![]() |