![]() |
![]() |

అల్లు అర్జున్ హీరోగా ఇప్పటి దాకా 19 సినిమాలు చేశాడు. 'ఎవడు' మూవీలో తను చేసింది అతిథి పాత్ర లాంటిదనే ఉద్దేశంతో దాన్ని బన్నీ తన సినిమాగా పరిగణలోకి తీసుకోవట్లేదు. అందుకే సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న 'పుష్ప' మూవీని 20వ సినిమాగా, కొరటాల శివ డైరెక్షన్‌లో చేయనున్నట్లు అనౌన్స్ చేసిన మూవీని 'ఏఏ21'గా పిలుస్తున్నాడు. 'పుష్ప' సినిమాలో బన్నీ జోడీగా తొలిసారి రష్మికా మందన్న కనిపించనుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అతను నటించిన 'అల.. వైకుంంఠపురములో' సినిమాలో బన్నీ, పూజా హెగ్డే జోడీ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా పండిందో, ఆ ఇద్దరి జోడీ ఎంత కన్నుల పండుగగా ఉందో మనం చూశాం. 'సామజవరగమన' పాటలో కానీ, 'బుట్టబొమ్మ' సాంగ్‌లో కానీ ఇద్దరూ పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్నారు. పాటలను పక్కన పెట్టినా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్లలోనూ ఆ జోడీ బాగా అలరించింది. అంతకుముందు ఆ ఇద్దరూ కలిసి నటించిన 'దువ్వాడ జగన్నాథమ్'లోనూ ఆ జోడీ ఆకట్టుకున్నా.. 'అల.. వైకుంఠపురములో' పండిన కెమిస్ట్రీయే వేరు.
బన్నీతో గతంలో ఇదే తరహా కెమిస్ట్రీ 'జులాయి'లో ఇలియానాతో, 'రేసుగుర్రం'లో శ్రుతి హాసన్‌తో పండింది. ఇప్పుడు అదే తరహాలో బన్నీ-రష్మిక జోడీ ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి బన్నీ ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది. నిజానికి 'అల.. వైకుంఠపురములో' సినిమాతో పాటే రిలీజైన మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్ రష్మిక. ఆ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్‌లో మహేశ్‌తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే మహేశ్‌తో ఆమెకు ఆ సినిమాలో ఎక్కువ సీన్లు లేవు. పాటల్లో వాళ్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది తప్ప పెద్ద కెమిస్ట్రీ కుదరలేదనే టాక్ వచ్చింది.
అయితే ఆ తర్వాత 'భీష్మ'లో నితిన్‌తో రష్మిక కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. కారణం.. అందులో ఆమెకు ఎక్కువ సీన్లు ఉండటంతో నితిన్ పక్కన ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో 'పుష్ప'గా నటిస్తోన్న బన్నీకి ఆమె సరిజోడీ అనిపించుకుంటుందా? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. 'రంగస్థలం'లో రామ్‌చరణ్ జోడీగా సమంతకు తగినంత ప్రాధాన్యం ఇచ్చి, వారి కెమిస్ట్రీ పండేలా చేసిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు అదే తరహాలో బన్నీ-రష్మిక పెయిర్‌ను ఆకర్షణీయంగా చూపిస్తాడా? లెటజ్.. వెయిట్ అండ్ సీ.
![]() |
![]() |