![]() |
![]() |

ప్రముఖ పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'ఆనందో బ్రహ్మ' నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్ రావు మేక సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన 'ఆనందో బ్రహ్మ' నవలను తెరకెక్కించే ఆలోచనతో హక్కులు సొంతం చేసుకున్నారు. 1729 పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.
మానవ సంబంధాలను, ఆత్మీయానుబంధాలను ప్రభావవంతంగా చిత్రించిన ఈ నవల త్వరలో చిత్రరూపంలో తెరపై అలరించనుంది. ఓ పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి సేద తీరుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? అనుబంధమా? సెక్సా? అనే ఆకట్టుకునే కథనంతో యండమూరి ఈ నవల అల్లారు. ఈ నవలను అధునాతన టెక్నాలజీతో ముక్తేశ్ రావు మేక తెరకెక్కించనున్నారు.
2020 ఫిబ్రవరిలో ముక్తేశ్ రావు ఇండియా వచ్చారు. ఆయన యండమూరిని కలిసి 'ఆనందో బ్రహ్మ' పుస్తకం సినిమా హక్కులు కావాలని అడిగారు. 1984లోనే ముక్తేశ్ ఈ పుస్తకాన్ని చదివారు. అప్పుడాయన వయసు 12 సంవత్సరాలు. ఆ పుస్తకం ఎందుకో తనకు బాగా నచ్చింది. ఇది సినిమాగా వస్తే బాగుంటుందని అనిపించింది. కానీ ఆ వయసులో తనకు సినిమా గురించి తెలియదు. ఆ తర్వాత తను చదువు బిజీలో పడిపోయారు. పై చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లారు. కానీ 'ఆనందో బ్రహ్మ' పుస్తకం మాత్రం వెంట తీసుకెళ్లడం మరువలేదు.
2009లో పని మీద ఇండియా వచ్చారు ముక్తేశ్ రావు. ఆ సమయంలో యండమూరి గారిని కలిసి 'ఆనందో బ్రహ్మ' రైట్స్ రెండు సంవత్సరాలకు తీసుకున్నారు. కానీ ఆ సమయంలో సినిమా నిర్మాణం చేపట్టలేకపోయారు. ఆ తర్వాత 1729 పిక్చర్స్ స్థాపించి హాలీవుడ్‌లో నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఇండియా వచ్చి మళ్లీ 'ఆనందోబ్రహ్మ' నవల హక్కులను పొందారు. త్వరలోనే ఈ సినిమా నిర్మాణం చేస్తానంటున్నారు. "గోదావరి నదీ తీరాన ఈ కథ సాగుతుంది. కానీ మిసిసిప్పీ తీరాన కూడా ఈ కథను నడిపించవచ్చు. ఇదొక యూనివర్సల్ స్టోరీ. నా 35యేండ్ల కల సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది'" అంటున్నారు ముక్తేశ్ రావు మేక.
'ఆనందో బ్రహ్మ' తన మనసుకు బాగా నచ్చిన నవల అని, దాన్ని సినిమాగా తీయాలంటే చాలా ధైర్య సాహసాలు ఉండాలని యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. తన మిగతా నవలల రైట్స్ అమ్ముడు పోయినంత వేగంగా ఈ నవల అమ్ముడు పోలేదని అన్నారు. ఆయనే ఈ నవలను సినిమాగా తెరకెక్కించాలనుకున్నా.. రకరకాల కారణాల వల్ల తీయలేకపోయారు. అటువంటి సమయంలో ముక్తేశ్‌రావు గారు ఈ నవల రైట్స్‌ను కొనడానికి ముందుకు వచ్చారు. అమెరికాలో స్థిరపడి, సినిమాలను నిర్మిస్తున్న ముక్తేశ్‌రావు ఈ నవల రైట్స్‌ను సొంతం చేసుకోవడం గొప్ప విషయమని యండమూరి అన్నారు. భవిష్యత్తు, గతం రెండూ మిళితమైన ఈ నవలను చిత్రంగా తెరకెక్కించాలంటే ధైర్య సాహసాలతో కూడిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |