![]() |
![]() |

లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సినిమాల్లో నాయికగా అడుగుపెట్టి సెప్టెంబర్ 12తో 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. అవును. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'కిలాడి కృష్ణుడు' 1980 సెప్టెంబర్ 12న విడుదలైంది. అందులో ఆమె సూపర్‌స్టార్ కృష్ణ సరసన నటించారు. కృష్ణ స్వయంగా సమర్పించిన ఆ చిత్రానికి ఆయన సతీమణి విజయనిర్మల దర్శకత్వం వహించారు. అంటే విజయశాంతిని చిత్రసీమకు పరిచయం చేసింది ఆ దంపతులే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయశాంతి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు.
"నా మొదటి తెలుగు సినిమా 'కిలాడి కృష్ణుడు' విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలతో..." అంటూ 'కిలాడి కృష్ణుడు' పోస్టర్‌ను షేర్ చేశారు.

రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల కొన్నేళ్లపాటు సినీ రంగానికి దూరంగా ఉన్న ఆమె తిరిగి' సరిలేరు నీకెవ్వరు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందర్భవశాత్తూ ఆ సినిమా హీరో కృష్ణ కుమారుడు మహేశ్ కావడం విశేషం.
![]() |
![]() |