![]() |
![]() |

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నానుతోంది.. అది మంచి విషయం కోసం కాకపోవడం ఇక్కడ విశేషం. అవును. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోని డ్రగ్ వేధింగ్ కోణంలో రకుల్ పేరు బయటకు వచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జరుపుతున్న విచారణలో రకుల్‌ప్రీత్, సారా అలీఖాన్ డ్రగ్స్ వాడుతున్నారనీ, కొంటున్నారనీ రియా చక్రవర్తి వెల్లడించినట్లు ప్రచారంలోకి వచ్చింది. దాంతో నెటిజన్లు రకుల్ ప్రీత్‌పై హిలేరియస్ మీమ్స్‌తో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.
రకుల్, సారా, డిజైనర్ సైమోన్ ఖంబట్టాలతో పాటు బాలీవుడ్‌లో పనిచేస్తున్న అనేకమందిపై ఎన్‌సీబీ దృష్టి పెట్టినట్లు వినిపిస్తోంది. ఇంటరాగేషన్‌లో మొదట తాను డ్రగ్స్ వాడలేదని వాదించిన రియా, ఆ తర్వాత డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అంగీకరించిందంటున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో డ్రగ్స్ తీసుకునే పలువురు వ్యక్తుల పేర్లను ఆమె బయటపెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్‌సీబీ దగ్గర 25 మంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు, వాళ్లపై అది నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చేసే ఫైనాన్సింగ్ మీదా ఎన్‌సీబీ దృష్టి సారించిందనీ వినవస్తోంది.
ఏదేమైనా డ్రగ్ కేసులో రకుల్‌ప్రీత్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌లో పలువురి ప్రముఖుల్ని తెలంగాణ పోలీసులు డ్రగ్ కేసులో విచారించిన ఉదంతం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉంది. ఇప్పుడు రకుల్‌ను ఎన్‌సీబీ విచారిస్తుందా? లేదా? విచారిస్తే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? అనేది ఆసక్తికరంగా మారడమే కాకుండా, టాలీవుడ్‌ను కలవరపరుస్తోంది.
![]() |
![]() |