![]() |
![]() |

విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి వార్తతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపుపొందిన జయప్రకాష్ రెడ్డి క్రూరమైన విలన్‌గానే కాకుండా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో తనదైన చెరగని ముద్ర వేశారనీ, అందరితోనూ ఆత్మీయంగా మెలగుతూ, మంచి మనసున్న మనిషిగానూ అందరి అభిమానాన్నీ పొందారనీ, అలాంటి వ్యక్తి ఇక లేరంటే నమ్మలేకపోతున్నామనీ నివాళులర్పిస్తున్నారు.
చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా జయప్రకాష్ రెడ్డితో తన అనుబంధాన్ని వివరిస్తూ, ఆయనకు నివాళి అందించారు.

జయప్రకాష్ రెడ్డి మరణం నన్నెంతో బాధించింది: డా. మంచు మోహన్ బాబు
"జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను. జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను."
మా అనుబంధం ఎంతో విశిష్టమైనది: నందమూరి బాలకృష్ణ
"జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళుగా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. మా ఇద్దరి మధ్యా ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను."






![]() |
![]() |