![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ సూర్య జూలై 23న 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సౌత్ ఇండియాలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఎంచుకునే సబ్జెక్టులు, చేసే పాత్రలు ఆయన టేస్ట్‌ను తెలియజేస్తాయి. 'గజిని' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలపైనా చెరగని ముద్ర వేశాడు సూర్య. ఆ సినిమా, అందులో సూర్య చేసిన పాత్ర విపరీతంగా నచ్చి బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఆ క్యారెక్టర్‌ను హిందీలో చేసి, అమిత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
'పితామగన్' (శివపుత్రుడు) సినిమా నుంచీ సూర్య నటించిన దాదాపు ప్రతి తమిళ సినిమా తెలుగులో అనువాదమవుతూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఆయన అదివరకటి సినిమాలను కూడా తెలుగులో డబ్ చేస్తూ వచ్చారు. 'మౌనమ్ పేసియదే' సినిమా ఆర్యన్ రాజేశ్ హీరోగా 'ఆడంతే అదో టైపు' పేరుతో రీమేక్ అయ్యింది. సూర్యను టాప్ లీగ్‌లోకి తెచ్చిన సినిమాల్లో ఒకటైన 'కాక్క కాక్క' మూవీ తెలుగులో వెంకటేశ్ హీరోగా ఘర్షణ పేరుతో రీమేక్ అయ్యి, ఆయనకూ పేరు తెచ్చిపెట్టింది. త్వరలో ఆయన 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తెలుగులోనూ సూర్యకు పేరు తెచ్చిన సినిమాలు...
1. శివపుత్రుడు (పితామగన్): ఇందులో టైటిల్ రోల్ విక్రమ్ చేయగా, సెకండ్ హీరోగా సూర్య గొప్పగా రాణించాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిశాడు.
2. గజిని (గజిని): మల్టిపుల్ డిజార్డర్ పేషెంట్‌గా సూర్య ప్రదర్శించిన అసమాన నటన ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేయడమే కాకుండా బ్లాక్‌బస్టర్ హిట్టయింది.
3. సూర్య సన్నాఫ్ కృష్ణన్ (వారణమ్ ఆయిరమ్): తండ్రీ కొడుకులుగా సూర్య ప్రదర్శించిన నటన తప్పకుండా చూడాల్సిందే. ఒరిజినల్ ఫిల్మ్‌తో బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు.
4. యముడు (సింగమ్): ఈ సినిమాలో నరసింహగా సూర్య ప్రదర్శించిన అభినయం, ఆయన చేసిన ఫైట్లు యాక్షన్ ప్రియులను అమితంగా అలరించడంతో సూపర్ హిట్టయింది. దీని సీక్వెల్స్‌ను కూడా తెలుగువాళ్లు ఆదరించారు.
5. సెవెన్త్ సెన్స్ (7అవమ్ అరివు): సైన్స్ ఫిక్షన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ మూవీలో అరవింద్‌గా సూర్య బాగా ఆకట్టుకున్నాడు.
6. 24 (24): తండ్రి, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయంతో చెలరేగిపోయాడు సూర్య. హీరోగా, విలన్‌గా రెండు భిన్న పాత్రలను అతను పోషించిన తీరు అపూర్వం.
7. ఎన్‌జీకే (ఎన్‌జీకే: నంద గోపాల కుమారన్): ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడకపోయినా టైటిల్ రోల్‌లో సూర్య ప్రదర్శించిన నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
![]() |
![]() |