![]() |
![]() |

తెలుగు సినిమా సాహిత్యానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ముందు వరుసలో ఉంటారు. 'నా ఉఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం' అంటూ కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు ఆయన. సిరివెన్నెల సాహిత్య సముద్రంలో మునగని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తన పాటతో కోట్ల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సిరివెన్నెల. అంతలా తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆయన గతేడాది నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. మరణం తర్వాత ఈ మే 20 ఆయన మొదటి జయంతి కావడంతో.. ఆయన అక్షరాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు.

సిరివెన్నెల రచించిన ప్రతి అక్షరాన్ని ముద్రించి పుస్తక రూపంలో అభిమానులకు అందించాలనే బృహత్ యజ్ఞం తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా.తోటకూర ప్రసాద్ సంకల్పించి తానా మరియు సిరివెన్నెల కుటుంబం సహకారంతో సాకారం చేశారు. సినిమా సాహిత్యం నాలుగు సంపుటాలుగ, సినీయేతర సాహిత్యం మరో రెండు సంపుటాలుగ రానున్నాయి. మే 20న సిరివెన్నెల జయంతి సందర్బంగా మొదటి సంపుటి గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ద్వారా విడుదలవుతోంది.

సిరివెన్నెల జయంతి వేడుకలు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో శుక్రవారం సాయంత్రం జరగనున్నాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సిరివెన్నెల సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని సిరివెన్నెల కుటుంబానికి అందజేయనున్నారు. గరికపాటి నరసింహారావు పుస్తక పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్, డైరెక్టర్ త్రివిక్రమ్ హాజరు కానున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు సినీ దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు పాల్గొనబోతున్నారు.

![]() |
![]() |