![]() |
![]() |

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా 'కొండ పొలం' కమర్షియల్ సక్సెస్ అందించలేకపోయినప్పటికీ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు తన మూడో సినిమా 'రంగ రంగ వైభవంగా'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు వైష్ణవ్. అయితే మే 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.
'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ ఫేమ్ గిరీశయ్య డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వైష్ణవ్ కి జంటగా 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్, కేతిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాని మే 27 న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు ఫిబ్రవరిలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ మారింది. ఈ మూవీని జూలై 1 న రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మరో పోస్టర్ ని వదిలారు.

మే 27 న వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్-3' విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే 'రంగ రంగ వైభవంగా'ని జూలై 1 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' కోసం వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ ఏప్రిల్ 8 కి వాయిదా పడింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' కోసం చిరంజీవి లీడ్ రోల్ పోషించిన 'ఆచార్య' ఏప్రిల్ 29 కి పోస్ట్ పోన్ అయింది. కరోనా కారణంగా సినిమాలు ఆలస్యమై దాదాపు ఒకే సమయానికి వస్తుండటంతో మెగా హీరోలు ఒకరి కోసం ఒకరు సినిమాల విడుదల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది.
![]() |
![]() |