![]() |
![]() |

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ లవ్ స్టొరీ భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ రేంజ్ కి తగ్గ సినిమా కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే, హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా రిజల్ట్ ముందే ఊహించిందా అనే అభిప్రాయం కలుగుతోంది.
'రాధేశ్యామ్' ప్రీమియర్స్ స్టార్ట్ అయిన కాసేపటికే సినిమా స్లోగా ఉందంటూ ట్విట్టర్ లో ప్రచారం స్టార్ట్ అయింది. కొందరు కావాలనే ఈ విధంగా నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో పూజా హెగ్డే చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రిజల్ట్ ఆమె ముందే ఊహించిందా అనే అనుమానాలు కలిగేలా చేస్తోంది ఆ ట్వీట్.

రాధేశ్యామ్ సెట్స్ లో తన పర్సనల్ స్టాఫ్ తో దిగిన ఓ ఫోటో ని నిన్న రాత్రి 11 గంటల సమయంలో ట్విట్టర్ వేదికగా పంచుకుంది పూజ. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. "నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు నా టీమ్ కి ధన్యవాదాలు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా సమయంలో మీరు నా కోసం చేసిన అన్నిటికీ కృతజ్ఞతతో ఉంటాను" అంటూ పూజ ట్వీట్ చేసింది.

మాములుగా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు తమ సినిమా అద్భుతంగా ఉందని చెబుతుంటారు. విడుదల తర్వాత కూడా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమా బాగుందనే చెప్పుకుంటారు. కానీ పూజ మాత్రం సినిమా విడుదల సమయంలో 'సినిమా ఫలితం ఎలా ఉన్నా' అని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా సక్సెస్ పై నమ్మకం లేకే పూజ ఈ విధంగా ట్వీట్ చేసిందా అన్న చర్చ నడుస్తోంది.
![]() |
![]() |