![]() |
![]() |

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302లో ఉన్న ఉరిశిక్షను రద్దు చేయాలని పోరాడే చిరంజీవి అనే ఓ యువ న్యాయవాది కథ.. `అభిలాష`. కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ఎంతో గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రమిది. చిరంజీవి పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా పాటల్లో తన నృత్యాలతో యువతరాన్ని విశేషంగా అలరించారాయన. చిరుకి జోడీగా రాధిక నటించిన ఈ సినిమాలో రావుగోపాల రావు, రాళ్ళపల్లి, గొల్లపూడి మారుతి రావు, రాజ్యలక్ష్మి, మాడా వెంకటేశ్వరరావు, సి.ఎస్. రావు, పీజే శర్మ, కృష్ణ చైతన్య, థమ్, మల్లికార్జున రావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ ప్రసిద్ధ నవల `అభిలాష` ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీని అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు, నేపథ్య సంగీతం `అభిలాష`కి ప్రధాన బలంగా నిలిచాయి. దిగ్గజ గీతరచయితలు ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలు వారిన పాటలన్నింటిని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి గానం చేశారు. ``నవ్వింది మల్లె చెండు``, ``ఉరకలై గోదావరి``, ``బంతి చేమంతి``, ``వేళాపాల లేదు``, ``సందెపొద్దుల కాడ``.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించిన `అభిలాష`.. తమిళంలో `సట్టత్తై తిరుత్తుంగళ్` (1984) పేరుతో రీమేక్ అయింది. 1983 మార్చి 11న విడుదలై జననీరాజనాలు అందుకున్న `అభిలాష`.. నేటితో 39 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |