![]() |
![]() |

'బాహుబలి' తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్. బాహుబలికి ముందు ఒక లెక్క, బాహుబలి తర్వాత ఒక లెక్క. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రమే కాదు.. హిందీతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ సినిమాల ఎంపిక ఎలా ఉండాలి. ఫ్యాన్స్ తో పాటు అన్ని సెక్షన్ ఆడియెన్స్ కి అలరించేలా ఉండాలి. కానీ ప్రభాస్.. ఏదో మీడియం రేంజ్ హీరో లాగ 'రాధేశ్యామ్' అనే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు.
'బాహుబలి' సిరీస్ తర్వాత 'సాహో' అనే యాక్షన్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు ప్రభాస్. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఆ సినిమా హిందీలో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న సుజిత్ కి అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి తప్పు చేశాడన్న అభిప్రాయం ఆ సమయంలో ఫ్యాన్స్ నుంచి వ్యక్తమైంది. ఆ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తో 'రాధేశ్యామ్' అనే ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ కి ఇప్పుడు లవ్ స్టోరీ అవసరమా అని అప్పుడే ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఆ తర్వాత జాతకాలు, 18 ఏళ్ళ క్రితం అనుకున్న కథ అని తెలిసి ఫ్యాన్స్ మరింత డిజప్పాయింట్ అయ్యారు.
రాధేశ్యామ్ స్టోరీ లైన్ చాలా చిన్నది, పాతది. అసలు ఈ కథకి ప్రభాస్ లాంటి స్టార్ అవసరం లేదు. ఈ కథలో అంతటి స్టార్ ని ఆడియన్స్ చూడలేరు. జాతకాలు మీద నమ్మకం లేని ప్రభాస్ అంతలా ఏం నచ్చి ఈ కథ ఓకే అర్థం చేశాడో అర్థం కావట్లేదు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన 'జిల్' సినిమాతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. యూవీ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ లాంటిది. రాధేశ్యామ్ నిర్మాతలు కూడా వాళ్లే. ప్రభాస్ కి వాళ్ళతో ఉన్న అనుబంధం కారణంగానే మొహమాటం కొద్దీ ఈ సినిమా ఓకే చేశాడా అన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో సాహో విషయంలోనూ ఫ్యాన్స్ ఇదే అభిప్రాయపడ్డారు. ఆ సినిమా కూడా యూవీనే నిర్మించింది. తమ బ్యానర్ లో 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ కి.. ఏకంగా రెండో సినిమాకే బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'సలార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్ట్ K', 'స్పిరిట్' సినిమాలు ప్రభాస్ ఇమేజ్ తగ్గ సినిమాలు అని చెప్పొచ్చు. అయితే ఒక సినిమా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. అదే మారుతి దర్శకత్వంలో చేయబోయే కామెడీ ఎంటర్టైనర్. యంగ్ హీరోలతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేసిన మారుతి.. బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయలేదు. సీనియర్ హీరో వెంకటేష్ తో చేసిన 'బాబు బంగారం' నిరాశపరిచింది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ మారుతితో కామెడీ సినిమా చేయడానికి రెడీ అవుతుండటం ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకనైనా తన ఇమేజ్ కి తగ్గ సినిమాలు చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |