![]() |
![]() |

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించాక ఆమె వారసులమంటూ ఎందరో మీడియా ముందుకు వచ్చారు. అయితే జయలలిత సంపాదించిన ఆస్తులను కొట్టేయాలన్న ఉద్దేశంతోనే చాలా మంది ఇలా నాటకాలు ఆడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా తమిళనాడులోని మధురైకి చెందిన మీనాక్షి అనే 38 ఏళ్ల మహిళ.. తాను శోభన్ బాబు, జయలలితకు పుట్టిన బిడ్డను అంటూ హంగామా చేయడం సంచలనంగా మారింది.
తన తల్లి జయలలిత మృతి చెందిందని, తనకు ఆమె కూతురుగా వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జనవరి 27న మీనాక్షి దరఖాస్తు చేసుకుంది. తల్లి పేరు జయలలిత, తండ్రి పేరు శోభన్ బాబు అని ఉండడంతో ఆమె అప్లికేషన్ ని అధికారులు పక్కన పడేశారు. దీంతో రోజులు గడుస్తున్నా సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆమె తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వాగ్వివాదానికి దిగింది.
జయలలిత అసలు వారసురాలిని తానేనని, చిన్నప్పుడే తన తల్లి జయలలిత తనను వదిలేసిందని చెప్పుకొచ్చింది. పళనిలో బంగారు రథం లాగే హక్కును తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపింది. తనకు వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరు అంటూ వాదనకు దిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు జయలలిత చెన్నైలో మృతి చెందారు కాబట్టి అక్కడికే వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో.. వారసత్వం విషయం కోర్టుకు వెళ్లి తేల్చుకోండీ అంటూ అధికారులు ఆమెకు పలు విధాలుగా నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
![]() |
![]() |