![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాలు మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేశాయి. వాటిలో `కిరాయి కోటిగాడు` ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి రూపొందించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కృష్ణకి జంటగా `అతిలోక సుందరి` శ్రీదేవి దర్శనమిచ్చారు. కిరాయి కోసం ఏమైనా చేసే కోటిగాడు (కృష్ణ)ని.. ఇద్దరు భూస్వాములు స్వార్ధం కోసం వినియోగిస్తుంటారు. అయితే, గౌరి (శ్రీదేవి) కోటిగాడిని మంచి వైపు మళ్ళించడంతో.. భూస్వాములకు వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో `కిరాయి కోటిగాడు` చిత్రం తెరకెక్కింది. రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, శ్రీధర్, ముచ్చర్ల అరుణ, జయమాలిని ఇందులో ముఖ్య పాత్రల్లో అలరించారు.
Also Read: వైఎస్ జగన్ తో భేటీపై రాజమౌళి కామెంట్స్.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం!
దిగ్గజ సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``నమస్తే సుస్వాగతం``, ``పట్టుమీదా ఉన్నాది``, ``ఎక్కితొక్కి నీ అందం``, ``కూడబలుక్కుని``.. ఇలా ఇందులోని గీతాలన్ని మాస్ ని రంజింపజేశాయి. రామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన `కిరాయి కోటిగాడు`కి సత్యమూర్తి కథను అందించగా, సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. 1983 మార్చి 17న విడుదలై ఘనవిజయం సాధించిన `కిరాయి కోటిగాడు`.. నేటితో 39 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |