![]() |
![]() |

తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు, కళాభినేత్రి వాణిశ్రీ జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `ఆలుమగలు` ఒకటి. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో `ఆలుమగలు`గా టైటిల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేశారు ఏఎన్నార్, వాణిశ్రీ. ఆలుమగల మధ్య ఎంతటి భేదాభిప్రాయాలు వచ్చినా సర్దుకుపోవాలే కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని.. కాపురాన్ని కల్లోలం చేసుకోకూడదనే పాయింట్ తో ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది. ఇందులో గుమ్మడి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, రాజబాబు, నారాయణరావు, సారథి, రమాప్రభ, విజయలలిత, రోజారమణి, హలం, సంగీత, అనిత, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
Also Read: ఆ లెక్కలేసుకొని 'ఆర్ఆర్ఆర్' తీయలేదు.. అలాంటి సినిమా చేయను
టి. చలపతిరావు సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ గీతరచయితలు సి.నా.రె, శ్రీ శ్రీ, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``ఎరక్క పోయి వచ్చాను``, ``చిగురేసే మొగ్గేసే`` విశేషాదరణ పొందగా.. ``పరుగెత్తి పాలు``, ``ఒక్కరు ఇద్దరుగా``, ``తెలుసుకో ఈ జీవితం``, ``కోడెగాడు`` కూడా రంజింపజేశాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు నిర్మించిన `ఆలుమగలు`.. తమిళంలో `నల్లతోరు కుటుంబం`, హిందీలో `జుదాయి`, కన్నడలో `శుభామిలన` పేర్లతో రీమేక్ అయింది. 1977 మార్చి 17న విడుదలై ఘనవిజయం సాధించిన `ఆలుమగలు`.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |