![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఈ మూవీ బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. రెమ్యునేషన్స్ కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్ అయిన సినిమాలు పదిరోజుల పాటు ప్రత్యేక ధరలకు వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం 'ఆర్ఆర్ఆర్' దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యి తమ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి పేర్ని నాని ఈ అంశంపై స్పందించారు.
జీఎస్టీ, రెమ్యునేషన్స్ కాకుండా 'ఆర్ఆర్ఆర్'కి రూ.336 కోట్లు ఖర్చు చేశామని, కొత్త జీవో ప్రకారం పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ సినిమా దర్శక నిర్మాతల నుంచి వినతిపత్రం అందిందని పేర్ని నాని తెలిపారు. సంబంధిత అధికారులు ఆ వివరాలు పరిశీలిస్తున్నారని, త్వరలోనే ప్రత్యేక టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కొత్త జీవో రావడానికి ముందే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయినందున, ఏపీలో 20 శాతం షూటింగ్ నిబంధన ఆ సినిమాకి వర్తించదని చెప్పారు. కొత్తగా నిర్మించే సినిమాలకు ఆ నిబంధన వర్తిస్తుందని పేర్ని నాని అన్నారు.
రెమ్యునేషన్స్ కాకుండా 'ఆర్ఆర్ఆర్'కి రూ.336 కోట్లు ఖర్చు అయిందంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రెమ్యునేషన్స్ కి ఈజీగా మరో 200 కోట్లు అయ్యుంటుందని , ఈ లెక్కన ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లకు పైగా అయ్యుంటుందని షాక్ అవుతున్నారంతా.
![]() |
![]() |