![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుక అంటే ఉండే సందడే వేరు. సంబరాలు అంబరాన్ని అంటుతాయి. దానికి తోడు ఈసారి భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారని ప్రకటన రావడంతో ఈ వేడుకపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తన పొలిటికల్ స్పీచ్ లతో అదరగొట్టే కేటీఆర్.. ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడతారు, పవన్ గురించి ఏం చెబుతారు అని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. ఊహించినట్లే కేటీఆర్ తన స్పీచ్ అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ అంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోని తాను చూడలేదని కేటీఆర్ అన్నారు.
"నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్(యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్)లో రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కి హాజరయ్యాను. అప్పుడు మాట్లాడుతూ తండ్రేమో మెగాస్టార్, బాబాయ్ ఏమో పవర్ స్టార్ అనగానే గ్రౌండ్ అంతా అరుపులు కేకలతో మారుమోగిపోయింది. నేను ఇక్కడికి మంత్రిగా రాలేదు, ఒక సోదరుడిగా వచ్చాను. మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి, బహుశా నాకు తెలిసినంతవరకు సూపర్ స్టార్స్ సినిమా స్టార్స్ చాలా మంది ఉంటారు కానీ, కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్. మేం అందరం కాలేజ్ రోజుల్లో మీ తొలిప్రేమ చూసిన వాళ్ళమే. అప్పటి నుంచి ఇప్పటివరకు 25 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్ డమ్ ని, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకోవడం ఒక అసాధారణమైన విజయం." అంటూ పవన్ పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
"తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, భారత చలన చిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ ని రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం. అలాగే మీరు షూటింగ్ లు చేయాలంటే గోదావరి జిల్లాలలో లాగా ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం పుణ్యమా అని మల్లన్న సాగర్ లో, కొండా పోచమ్మ సాగర్ లో చేయొచ్చు." అని చెప్పిన కేటీఆర్ ఆ తర్వాత మైక్ ని పవన్ కి అందించారు.
![]() |
![]() |