![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' మూవీపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. ఈ నెల 25న ఆ సినిమా విడుదలవుతున్న థియేటర్లు అన్నింటికీ రెండు రోజుల ముందుగానే నోటీసులు జారీ చేసింది. తహసీల్దారు పేరిట లిఖితపూర్వకంగా ఈ నోటీసులు పంపడం గమనార్హం. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 'భీమ్లా నాయక్'కు రెండు వారాల పాటు అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు షోలకు నిరాకరించడమే కాకుండా, టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
"ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా 'భీమ్లా నాయక్' తెలుగు చిత్రం విడుదలవుతున్న విషయం విదితమే. అట్టి చిత్రంకు సంబంధించి ఏ విధమైన బెనిఫిట్ షో కానీ, అదనపు చిత్ర ప్రదర్శనలు కానీ మరియు టికెట్లు అధిక ధరలకు విక్రయించడం చేయరాదు. మీకు సినిమా ప్రదర్శనకు టికెట్లను అధిక ధరలకు విక్రయించుటకు ఏ విధమైన ఉత్తర్వులు లేనందున, అటుల టికెట్లను అధిక ధరలకు విక్రయించిన యెడల మీపై సినిమాటోగ్రఫీ యాక్ట్, 1952 మరియు రూల్స్ ప్రకారం మరియు చట్టప్రకారం తగు చర్యలు తీసుకోబడును. కావున తెలియజేయడమైనది" అంటూ తమ ప్రాంతంలోని థియేటర్లకు తహసీల్దార్లు ఈ నోటీసు పంపారు. అదనపు షో వేసినా, టికెట్ ధరలు పెంచినా థియేటర్లను సీజ్ చేస్తామని చెప్పటమే ఈ నోటీసుల అంతరార్థం అని విశ్లేషకులు అంటున్నారు.
సంక్రాంతి పండుగకు నాగార్జున - నాగచైతన్య సినిమా 'బంగార్రాజు' విడుదలైనప్పుడు థియేటర్లకు ఇలాంటి నోటీసులేవీ తహసీల్దార్లు ఇవ్వలేదు. థియేటర్ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపిన రేట్ల ప్రకారం కాకుండా తాము నిర్ణయించిన రేట్ల ప్రకారమే టికెట్లను అమ్మారు. ఎక్కువ థియేటర్లలో వంద రూపాయలకు టికెట్లను అమ్మినట్లు సమాచారం. అప్పుడు చూసీ చూడనట్లు వదిలేసిన రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం.. ఇప్పుడు 'భీమ్లా నాయక్' విడుదల సందర్భంగా ఆంక్షల కత్తిని వేలాడదీయడం కేవలం రాజకీయపరమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల ఏ సినిమాపైనా ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించలేదనీ, పవన్ కల్యాణ్‌ను టెర్గెట్ చేసి, ఆయన సినిమాను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆంక్షలు పెడుతోందని ఆయన అభిమానులు అంటున్నారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందుగానే థియేటర్లకు అధికారులతో నోటీసులు పంపిన ప్రభుత్వం, రేపు సినిమా రిలీజయ్యాక ఇంకెన్ని ఆంక్షలు పెడుతుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.

![]() |
![]() |