![]() |
![]() |

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న ఎగ్జిబిటర్లలో ఆందోళన మొదలయ్యింది. కారణం.. అక్కడ థియేటర్లపై ప్రభుత్వం వేలాడదీస్తున్న ఆంక్షల కత్తి. కొన్ని జిల్లాల్లో 'భీమ్లా నాయక్' ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టికెట్ ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్ చేసినట్లు సమాచారం.
దీంతో ఎగ్జిబిటర్లలో ఆందోళన నెలకొంది. కోట్లు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తే నిబంధనల పేరుతో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ పేరుతో తమను వేధించవద్దని కోరుతున్నారు. తహసీల్దారులే నేరుగా థియేటర్ల యాజమాన్యానికి నిబంధనలు ఉల్లంఘిస్తే 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు.
ఇటీవలే సినీ ప్రముఖులుగా చిరంజీవి, మహేశ్, ప్రభాస్, రాజమౌళి, ఆర్. నారాయణమూర్తి, అలీ లాంటి వారు ఏపీ సీయం జగన్‌ను కలిసి, ఆయనతో సినిమా టికెట్ ధరలు, అదనపు షోల అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించారు. ఆ తర్వాత జగన్ తాము చెప్పిన వాటికి సానుకూలంగా స్పందించారనీ, సినిమా సమస్యలను పరిష్కరించడానికి ఆయన కట్టుబడి ఉన్నారనీ చెప్పారు. జగన్ సైతం ఏపీలో చిత్ర పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు తాము తోడ్పాటు అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా విషయంలో అక్కడి ప్రభుత్వం అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
![]() |
![]() |