![]() |
![]() |

యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని రుజువు చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందరూ గుర్తింపు వచ్చిన తర్వాత సంపాదన మీద దృష్టి పెడితే.. గంగవ్వ లాంటి వాళ్ళు మాత్రం తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఆమె చొరవతో వాళ్ళ సొంతూరికి ఆర్టీసీ బస్సు వచ్చింది.
గంగవ్వది జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్తులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఊరికి బస్సు సర్వీస్ పునరుద్దరించాలంటూ గ్రామస్తులతో కలిసి వెళ్లి గంగవ్వ జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడింది.

గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును పునరుద్ధరించారు అధికారులు. ఈ బస్సు సర్వీసుని తాజాగా గంగవ్వ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పులుగా బస్ సర్వీస్ ని నడిపిస్తుంది ఆర్టీసీ.
![]() |
![]() |