![]() |
![]() |

సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికీ, సినిమా ఇండస్ట్రీకీ మధ్య వారధిగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రెండు సార్లు.. ఒకసారి విడిగా, ఇంకోసారి మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినా ఇంతవరకూ టికెట్ ధరల విషయంలో కొత్త జీవోను ఆయన తెప్పించలేకపోయారు. ఫిబ్రవరి 25న సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' విడుదలైన విషయం, పాజిటివ్ టాక్‌తో భారీ సంఖ్యలో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్న విషయం మనకు తెలుసు.
ఆ సినిమా రిలీజ్‌కు ముందు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల విషయమై కొత్త జీవోను తెచ్చినట్లయితే చిరంజీవి ఎంతగానో సంతోషించేవారు. కానీ ఆయన ఆశించిన విధంగా ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లభించలేదు. పైగా 'భీమ్లా నాయక్'ను దెబ్బ కొట్టటానికి ఆ సినిమా విడుదలకు రెండు రోజుల ముందుగానే థియేటర్ల యజమానులకు టికెట్లను పాత ధరలకే అమ్మాలనీ, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్లతో నోటీసులు ఇప్పించడం చిరంజీవిని మనస్తాపానికి గురిచేసిందని అంటున్నారు. అందువల్లే 10 రూపాయల టికెట్‌తో 'భీమ్లా నాయక్'ను ప్రదర్శించలేమని 'సి' సెంటర్లలోని ఎగ్జిబిటర్లు పలుచోట్ల చేతులెత్తేశారు.
తను జగన్‌పైనా, ఏపీ ప్రభుత్వంపైనా ఎంత మంచిగా చెప్పినా, జగన్ తనకు చెప్పిన మాటను నిలుపుకోలేదని సన్నిహితుల దగ్గర చిరంజీవి వాపోతున్నారు. తన మాటలకు ఏ మాత్రం విలువనిచ్చినా, 'భీమ్లా నాయక్' విషయంలో జగన్, ఆయన ప్రభుత్వం ధోరణి ఇలా ఉండేది కాదని ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సంగతి తెలిసిన పలువురు సన్నిహితులు ఆయన విషయంలో ఎప్పటికి రియలైజ్ అవుతారంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారని సమాచారం. చిరంజీవి కూడా జగన్ వ్యవహార ధోరణి విషయంలో మునుపటి సానుకూల ధోరణిని మార్చుకుంటున్నారనీ, ఇకముందు ఎలా సినిమా టికెట్ ధరల సమస్యపై చిరు స్పందించే తీరు భిన్నంగా ఉండబోతోందనీ వినిపిస్తోంది.
![]() |
![]() |