![]() |
![]() |

ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా బాగా ఉండేది. ముఖ్యంగా తమిళ సినిమాలు తెలుగు మార్కెట్ లో సత్తా చాటేవి. ఆ సమయంలో తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో ఆదరణ అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు సినిమా చూసే విధానం కూడా మారిపోయింది. సినిమా అద్భుతంగా ఉంటే తప్ప ఆదరించట్లేదు. ఇదే డబ్బింగ్ సినిమాల పాలిట శాపంగా మారింది. ఈ ఏడాది ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ డబ్బింగ్ సినిమాలు 9 విడుదల కాగా.. అందులో రెండే ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నాయి.
సామాన్యుడు(ఫిబ్రవరి 4):
యాక్షన్ హీరోగా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'సామాన్యుడు'పై ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. కొత్తదనం లేని కథ, ఆసక్తికరంగా సాగని కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్వయంగా విశాల్ నిర్మించడం విశేషం. విశాల్ ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. తెలుగులో రూ.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ మూవీ రెండు కోట్ల లోపు షేర్ రాబట్టి బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది.
వలిమై(ఫిబ్రవరి 24):
కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించిన వలిమై మూవీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో రూ.2.50 కోట్ల బిసినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 2.40 కోట్ల షేర్ రాబట్టి స్వల్ప నష్టాలతో అబౌవ్ యావరేజ్ గా నిలిచింది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి నిడివి పెద్ద మైనస్ గా మారింది. నిమిషాల తరబడి ఉన్న యాక్షన్ సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. అదే సమయంలో 'భీమ్లా నాయక్' విడుదల కావడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై దెబ్బ పడింది. లేదంటే నష్టాల నుంచి బయట పడి ఉండేదేమో.
హే సినామికా(మార్చి 3):
'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈ ఏడాది 'హే సినామికా' అనే తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలీదు. బృందా మాస్టర్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసిన అరకొర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి బిజినెస్ జరిగిందే తక్కువంటే.. ఇంకా దారుణమైన కలెక్షన్స్ తో ప్లాప్ గా నిలిచింది.
ఈటీ(మార్చి 10):
నేరుగా ఓటీటీలో విడుదల చేసిన 'ఆకాశం నీ హద్దురా', 'భీమ్' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య.. రెండేళ్ల తర్వాత 'ఈటీ' సినిమాతో థియేటర్స్ లో సందడి చేశాడు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు ఇదసలు సూర్య సినిమానేనా అనుకునే అంతలా నిరాశపరిచింది ఈటీ. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పేరుకి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ.. పరమ రొటీన్ ఫిల్మ్ గా మిలిగిపోయింది. తెలుగులో 3.50 కోట్ల బిజినెస్ చేసిన ఈటీ ఇక్కడ సూర్యకు ఉన్న ఆదరణ కారణంగా 3.46 కోట్ల షేర్ రాబట్టి స్వల్ప నష్టాలే చూసింది.
జేమ్స్(మార్చి 17):
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' కర్ణాటకలో భారీ కలెక్షన్స్ తో సత్తా చాటినప్పటికీ తెలుగులో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
బీస్ట్(ఏప్రిల్ 13):
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సినిమాలు కొంతకాలంగా తెలుగులోనూ సత్తా చాటుతున్నాయి. విజయ్ గత చిత్రం 'మాస్టర్' ఇక్కడా మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో బీస్ట్ సినిమా తెలుగులో ఏకంగా 10 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో రూ.7.33 షేర్ రాబట్టిన బీస్ట్ బయ్యర్లకు దాదాపు మూడు కోట్ల నష్టం మిగిల్చి ప్లాప్ గా నిలిచింది.
కేజీఎఫ్ చాప్టర్-2(ఏప్రిల్ 14):
ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన కన్నడ పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్-1' తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దీంతో 'కేజీఎఫ్-2' ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ దాదాపు 85 కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది. ఈ ఏడాది తెలుగులో హిట్ అయిన మొదటి డబ్బింగ్ సినిమా ఇదే కావడం విశేషం.
కన్మణి రాంబో ఖతీజా(ఏప్రిల్ 28):
విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఇలా ముగ్గురు స్టార్స్ కలిసి నటించినప్పటికీ ఈ సినిమాకి ఎందుకనో అంతగా హైప్ రాలేదు. అందుకే తెలుగులో 2.60 కోట్ల బిజినెస్ తో సరిపెట్టుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో కోటిన్నర లోపు షేర్ తో ప్లాప్ గా నిలిచింది.
డాన్(మే 13):
గతేడాది 'డాక్టర్'తో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ ఈ ఏడాది 'డాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి రోజు పర్లేదు అనే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. తెలుగులో 1.30 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 2 కోట్లకు పైగా షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరిపోయింది. ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదలైన తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో ఇదొక్కటే విజయాన్ని అందుకోవడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ జూన్ 3న కమల్ హాసన్ ప్రధానపాత్ర పోషించిన 'విక్రమ్' మూవీ విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో మెరవనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
![]() |
![]() |