![]() |
![]() |

తన తండ్రి, నటరత్న నందమూరి తారక రామారావు తరహాలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా విభిన్న ప్రయోగాలు, ప్రయత్నాలు చేశారు. త్రిపాత్రాభినయం కూడా ఇందులో భాగమే. `కుల గౌరవం` (1972), `దాన వీర శూర కర్ణ` (1977) చిత్రాల్లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ ప్లే చేయగా.. బాలయ్య కూడా `అధినాయకుడు` (2012) కోసం అదే బాట పట్టారు. హరిశ్చంద్ర ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, బాబీ.. ఇలా మూడు తరాల పాత్రల్లో తాతగా, తండ్రిగా, మనవడిగా తన అభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు బాలకృష్ణ. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో లక్ష్మీ రాయ్, సుకన్య, జయసుధ, సలోని (అతిథి పాత్ర), ప్రదీప్ రావత్, ఆదిత్యా మీనన్, కోట శ్రీనివాసరావు, రహమాన్, మురళీ శర్మ, బ్రహ్మానందం, చరణ్ రాజ్, వేణు మాధవ్, కాశీ విశ్వనాథ్, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కళ్యాణి మాలిక్ సంగీతమందించిన ఈ చిత్రానికి భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ``మస్త్ జవాని``, ``ఓలమ్మి అమ్మి``, ``గురుడా ఇటు రారా``, ``అందం ఆకుమడి``, ``అదిగో``, ``ఊరంతా`` అంటూ మొదలయ్యే పాటలన్నీ అలరించాయి. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం. ఎల్. పద్మ కుమార్ చౌదరి నిర్మించిన `అధినాయకుడు`.. 2012 జూన్ 1న విడుదలైంది. నేటితో ఈ చిత్రం పది వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |