![]() |
![]() |

తెలుగు సినిమా పరిశ్రమలో 'మెగా ఫ్యామిలీకి' ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి(Chiranjeevi),పవన్ కళ్యాణ్(Pawan Kalyan),రామ్ చరణ్(Ram Charan),వరుజ్ తేజ్,సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌తేజ్ ఇలా ఆరుగురు హీరోలని కలిగి ఉన్న మెగా ఫ్యామిలీ,సుదీర్ఘ కాలం నుంచి తమ సినిమాలతో, అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. ముఖ్యంగా అభిమానుల్లో అయితే ఈ ఆరుగురి నుంచి సినిమా వస్తుందంటే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ కొంత కాలంగా మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నాయి.
2023 అగస్ట్ 11 న 'భోళాశంకర్' తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో అజిత్ నటించిన హిట్ మూవీ 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, 'కథ', "కథనాలు" మూస పద్ధతిలో సాగడంతో, చిరు కెరీర్ లో భోళాశంకర్' బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. దీంతో సుమారు 50 కోట్ల వరకు నష్టం వచ్చినట్లుగా ఫిలిం వర్గాల్లో టాక్ వినపడింది. ఈ ప్లాప్ వల్లనే 2024 లో చిరంజీవి ఎలాంటి చిత్రాన్ని రిలీజ్ చెయ్యలేదు. ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని, కథపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ ఏడాది చివర్లో సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర’(Vishwambhara)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అనిల్ రావిపూడి తో చేస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
పవన్ కళ్యాణ్ 2023 లో సముద్రఖని దర్శకత్వంలో 'బ్రో' మూవీ చేసాడు. ప్రచార చిత్రాలతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సాయి ధరమ్ తేజ్ ఒక హీరోగా చేసాడు. రన్నింగ్ లో ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేక, యావరేజ్ గా నిలిచింది. 40కోట్ల మేర నష్టాలు వచ్చాయనే టాక్ సినీ సర్కిల్స్ లో జోరుగానే వినిపించింది. గత నెల జులైలో 'హరిహర వీరమల్లు’తో వచ్చాడు. తొలిరోజు పర్వాలేదనే టాక్ వచ్చినా, వారం రోజులకే థియేటర్ల నుంచి వెళ్లిపోయి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం, సుమారు 85 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు టాక్. ఇక అభిమానుల ఆశలన్నీ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ’(Og)పైనే ఉన్నాయి. సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్' తో జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘ఆచార్య’ భారీ ప్లాప్ ని ఇచ్చింది. నష్టాలు కూడా భారీగానే వచ్చాయి. ఆ తర్వాత 'శంకర్' డైరెక్షన్ లో 'దిల్ రాజు' నిర్మాణ సారధ్యంలో ఎన్నో అంచనాలతో వచ్చిన పొలిటికల్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్. సుమారు 100 కోట్లకు పైగా నష్టాల్ని మిగిల్చిందనే మాటలు వినిపించాయి. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీగా ‘పెద్ది’ చేస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మిగిలిన మెగా హీరోల విషయానికి వస్తే వరుణ్ తేజ్(Varun Tej)రెండు సంవత్సరాల్లో 'గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో వరుస పరాజయాలని ఎదుర్కున్నాడు. ఆ మూడు చిత్రాల వలన 80 కోట్లు వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ . తొలి చిత్రం ‘ఉప్పెన’తో 100 కోట్లు కొల్లగొట్టిన వైష్ణవ్‌తేజ్(Vaisshnav Tej)ఆ తర్వాత కొండపొలం,రంగ రంగ వైభవంగా, ఆదికేశవ' ప్లాపులతో భారీ నష్టాలని ఎదుర్కున్నాడు.ఈ అందరితో పోల్చుకుంటే 'సాయిధరమ్ తేజ్' కొంచం పర్లేదు. 'బ్రో’తో ఫ్లాప్ ని ఎదుర్కున్నా ‘విరూపాక్ష’తో కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. మంచి లాభాలని కూడా తెచ్చిపెట్టింది. ‘సంబరాల ఏటిగట్టు’ అనే మరో విభిన్న మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విధంగా విరూపాక్షతో 'సాయి ధరమ్ తేజ్' తప్ప మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ గా నిలవడంతో 400 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

![]() |
![]() |