![]() |
![]() |

ఉరిమి ఉరిమి పిడుగు నెత్తి మీద పడటం అంటే ఇదేనేమో! బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే ఆయన పాలిట శాపం అయిందేమో! కొందరు నెటిజన్లు ఆయన్ను టార్గెట్ చేయడానికి మౌనంగా ఉండడమే కారణం అంటే ఆశ్చర్యం వేయక మానదు. అసలు వివరాల్లోకి వెళితే...
కంగనా రనౌత్ ఆఫీసును ముంబై మహా నగరం మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన కొన్ని గంటల్లో కూల్చివేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గత రెండు నెలలుగా సుశాంత్ సూసైడ్ మిస్టరీ ప్రజల నోళ్లలో నానుతోంది. రియా చక్రవర్తి అరెస్టుపై సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఈ కరెంట్ టాపిక్స్ మీద అమితాబచ్చన్ ఏ అభిప్రాయమూ వెలిబుచ్చలేదని ఆయనను కొందరు నెటిజన్లు టార్గెట్ చేశారు.
"మౌనంగా ఎందుకు ఉన్నారు అమితాబ్?" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ "అమితాబ్ ఏ సమాధానము చెప్పనందుకు ఆయనను మనం ఎందుకు బ్లేమ్ చేయాలి? అమితాబ్ హాట్ సీట్లో కూర్చో లేదు. ఆయన కేవలం ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. సమాధానాలు చెప్పరు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. అలాగే నాలుగు హెల్ప్ లైన్లు కూడా! సమయం ముగిసింది అని చెప్పడానికి మాత్రమే ఆయనకు అధికారం ఉంది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత 'కౌన్ బనేగా కరోడ్ పతి' షూటింగ్ స్టార్ట్ చేసిన అమితాబ్ బచ్చన్.. దానికి సంబంధించిన అప్డేట్ లు ఇస్తున్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ, కరెంట్ అఫైర్స్ మీద స్పందించలేదు.
![]() |
![]() |