![]() |
![]() |

రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ తరం దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. తీసింది తక్కువ చిత్రాలే అయినా.. తెలుగునాట నిర్దేశకుడిగా ఎనలేని గుర్తింపుని పొందారు నాగ్ అశ్విన్. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా `ఎవడే సుబ్రమణ్యం`(2015) విమర్శకుల ప్రశంసలు, రెండు `నంది` అవార్డులు పొందగా.. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన నాగ్ ద్వితీయ చిత్రం `మహానటి`(2018) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్ గానూ నిలిచింది. తెలుగునాట బయోపిక్స్ కి ఊపు తీసుకువచ్చింది.
అలాగే, టైటిల్ రోల్ పోషించిన కేరళకుట్టి కీర్తి సురేశ్ కి స్టార్ డమ్ తీసుకురావడమే కాకుండా `బెస్ట్ యాక్ట్రస్`గా నేషనల్ అవార్డుని కూడా అందించింది. అదేవిధంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు), `బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్` విభాగాల్లోనూ జాతీయ పురస్కారాలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. ఇంకా `ఫిల్మ్ ఫేర్`తో సహా పలు పురస్కారాలను సొంతం చేసుకుంది.
Also Read: అప్పుడు హ్యాట్రిక్ హిట్స్.. ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్!
ఇలా తొలి, మలి చిత్రాలతో విశేషంగా మెప్పించిన నాగ్ అశ్విన్.. ఆపై నెట్ ఫ్లిక్స్ నిర్మించిన `పిట్టకథలు` (2021) అనే ఆంథాలజీ కోసం ఓ సెగ్మెంట్ ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `ప్రాజెక్ట్ కె` అనే పాన్ - ఇండియా మూవీ చేస్తున్నారు నాగ్. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనం ముందుకు రానుంది. కాగా, నాగ్ అశ్విన్ తొలి చిత్రం `ఎవడే సుబ్రమణ్యం`.. 2015లో ఇదే మార్చి 21న జనం ముందు నిలిచింది. అంటే.. నేటితో దర్శకుడిగా నాగ్ అశ్విన్ కెరీర్ ఏడేళ్ళు పూర్తిచేసుకుందన్నమాట. ఈ సందర్భంగా.. భవిష్యత్ లోనూ ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకులను మెప్పించేలా నాగ్ అశ్విన్ ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |