![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ కృష్ణ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. మరీముఖ్యంగా.. కృష్ణ మెగాఫోన్ పట్టిన మొదటి సినిమా `సింహాసనం` అయితే తెలుగునాట సంచలనం సృష్టించింది. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ సింహా, ఆదిత్య వర్ధన అనే రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు కృష్ణ. సూపర్ స్టార్ కి జోడీగా జయప్రద, రాధ, మందాకిని నటించిన ఈ చిత్రంలో కాంతారావు, కైకాల సత్యనారాయణ, గుమ్మడి, ఎం. బాలయ్య, ప్రభాకర రెడ్డి, గిరిబాబు, `షోలే` ఫేమ్ అమ్జాద్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. తెలుగులో 70 ఎం.ఎం. స్టీరియోఫోనిక్ సౌండ్ తో రూపొందిన తొలి సినిమాగా రికార్డులకెక్కిన `సింహాసనం`కి కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, నిర్మాత కూడా కృష్ణనే కావడం విశేషం.
Also Read: మంగళవారం కలెక్షన్ రూ. 18 కోట్లు.. 'ద కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ``ఆకాశంలో ఒక తార``, ``వహ్ వా నీ యవ్వనం`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``గుమ్మ గుమ్మ``, ``ఇది కలయని నేననుకోనా``, ``స్వాగతం``, ``వయ్యారమంతా`` గీతాలు కూడా రంజింపజేశాయి. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం.. కృష్ణ దర్శకత్వంలోనే హిందీలో `సింఘాసన్` (జితేంద్ర, జయప్రద, రాధ, మందాకిని) (1986) పేరుతో సమాంతరంగా తెరకెక్కి అక్కడ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1986 మార్చి 21న విడుదలై అఖండ విజయం సాధించిన `సింహాసనం`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |