![]() |
![]() |

తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో నట సామ్రాట్ ఏయన్నార్, అభినేత్రి అంజలీ దేవి జోడీ ఒకటి. మరీముఖ్యంగా.. వీరి కాంబినేషన్ లో వచ్చిన జానపద చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 1957 నాటి `సువర్ణ సుందరి` ఒకటి. సువర్ణ సుందరిగా అంజలీ దేవి అభినయించిన ఈ చిత్రంలో జయంత్ గా ఏయన్నార్ ఆకట్టుకున్నారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమణా రెడ్డి, రేలంగి, గుమ్మడి, సీఎస్ఆర్, బాలకృష్ణ, పేకేటి శివరామ్, రాజసులోచన, గిరిజ, కాంచన, ఈవీ సరోజ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
పి. ఆదినారాయణ రావు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి సముద్రాల సీనియర్, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో ``పిలువకురా అలుగకురా``, ``హాయి హాయిగా ఆమని సాగే`` ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలవగా.. మిగిలిన గీతాలు కూడా రంజింపజేశాయి. అంజలి పిక్చర్స్ పతాకంపై పి. ఆదినారాయణ రావు నిర్మించిన `సువర్ణ సుందరి`.. హిందీలోనూ అదే పేరుతో ఏయన్నార్, అంజలీ దేవి జంటగా రీమేక్ అయి మంచి విజయం సాధించింది. అలాగే, ఏయన్నార్ నటించిన ఏకైక హిందీ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. కాగా, 1957 మే 10న విడుదలై సంచలన విజయం సాధించిన `సువర్ణ సుందరి`.. నేటితో 65 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |