![]() |
![]() |

తెలుగునాట కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో నటభూషణ శోభన్ బాబు ఒకరు. శోభన్ నటించిన ఫ్యామిలీ డ్రామాల్లో సింహభాగం నారీ నారీ నడుమ మురారి తరహా కథలే. వాటిలో `కార్తీక దీపం`కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇద్దరు నాయికల చిత్రాల ట్రెండ్ ఊపందుకుంది. శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శ్రీదేవి, శారద ప్రధాన నాయికలుగా నటించగా గీత, గుమ్మడి, లీలా వతి, ఎం. ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య, కేవీ చలం, సూర్యకాంతం, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం. ప్రభాకర్ రెడ్డి కథను అందించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రంలో ``ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం`` గీతం బహుళ ప్రజాదరణ పొందగా.. ``నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి``, ``చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది``, ``చూడ చక్కని దానా`` పాటలు కూడా ఆకట్టుకున్నాయి. 1979 హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన `కార్తీక దీపం`.. హిందీలో `మాంగ్ భరో సజనా`, తమిళంలో `కర్పూర దీపం`, కన్నడలో `సౌభాగ్య లక్ష్మి` పేర్లతో రీమేక్ అయింది. అలాగే, `ఉత్తమ నటుడు`గా శోభన్ బాబుకి `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందించింది. జి. రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్య నిర్మించిన `కార్తీక దీపం`.. 1979 మే 10న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 43 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |