![]() |
![]() |

అత్త - అల్లుడు మధ్య సాగే రసవత్తరమైన పోరు.. టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఓ హిట్ ఫార్ములా. సెన్సేషనల్ హిట్ `అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు` (1989) అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో `అత్త - అల్లుడు` కాన్సెప్ట్ మూవీ `అల్లుడా.. మజాకా!`. ఇందులో అత్తగా లక్ష్మి నటించగా.. చిరుకి జోడీగా రమ్యకృష్ణ, రంభ అలరించారు. ఊహ, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, చిన్నా, శ్రీహరి, అల్లు రామలింగయ్య, ఏవీయస్, మల్లికార్జున రావు, మహేశ్ ఆనంద్, చలపతి రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. హాస్య చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఈవీవీ సత్యనారాయణ.. ఈ యాక్షన్ కామెడీ డ్రామాని డైరెక్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
కోటి బాణీలకు వేటూరి, భువన చంద్ర సాహిత్యమందించారు. ఇందులోని ``అత్తో అత్తమ్మ కూతురా`` అంటూ సాగే గీతం చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``చిన్నపాపకేమో``, ``రెడ్డు రెడ్డు``, ``పిట్ట కూత``, ``ఉంగా ఉంగా``, ``మా వూరి దేవుడు`` పాటలు కూడా రంజింపజేశాయి. దేవీ ఫిల్మ్స్ పతాకంపై దేవీ వర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం.. 75 కేంద్రాలలో 50 రోజులు, 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 1995 ఫిబ్రవరి 25న రిలీజై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `అల్లుడా.. మజాకా!`.. నేటితో 27 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |