![]() |
![]() |

వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న ఈ తరం కథానాయకుల్లో ఆది సాయికుమార్ ఒకరు. `ప్రముఖ నటులు పీజే శర్మ మనవడు`, `డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు` అనే ట్యాగ్స్ తో నటుడిగా పరిచయమైనా.. అనతికాలంలోనే తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన రొమాంటిక్ డ్రామా `ప్రేమ కావాలి`తో వెండితెరపై తొలి అడుగేసిన ఆది.. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ అందుకున్నాడు. అలాగే తన నటనతో, నర్తనంతో యువ ప్రేక్షకులను అలరించాడు. ఆపై రెండో చిత్రం `లవ్ లీ`తోనూ మరో సక్సెస్ చూశాడు.
అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఆది.. ఆనక `సుకుమారుడు`, `ప్యార్ మే పడిపోయానే`, `గాలిపటం`, `రఫ్`, `గరమ్`, `చుట్టాలబ్బాయ్`, `శమంతకమణి`, `నెక్స్ట్ నువ్వే`, `బుర్ర కథ`, `జోడి`, `ఆపరేషన్ గోల్డ్ ఫిష్`, `శశి`, `అతిథి దేవో భవ` వంటి చిత్రాల్లో సందడి చేశాడు. అయితే, వీటిలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ లిస్ట్ లో చేరలేకపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. `జంగిల్`, `కిరాతక`, `అమరన్ ఇన్ ద సిటీ`, `బ్లాక్` చిత్రాల్లో నటిస్తున్నాడు. కాగా, ఆది తొలి చిత్రం `ప్రేమ కావాలి` విడుదలై ఈ ఫిబ్రవరి 25కి సరిగ్గా 11 ఏళ్ళు. అంటే.. నేటితో ఆది అభినయపర్వానికి 11 వసంతాలు పూర్తయ్యాయన్నమాట. ఈ సందర్భంగా రాబోయే చిత్రాలతో ఆది మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |