![]() |
![]() |

మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో మాస్ మహరాజా రవితేజ ఒకరు. అలా రవితేజ వినోదాలు పంచిన సినిమాల్లో `వెంకీ`కి ప్రత్యేక స్థానం ఉంది. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన శ్రీను వైట్ల కాంబినేషన్ లో రవితేజ నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగి.. అప్పట్లో కాసుల వర్షం కురిపించింది. టైటిల్ రోల్ లో రవితేజ ఆకట్టుకోగా.. అతనికి జంటగా స్నేహ కనువిందు చేసింది. అశుతోశ్ రాణా, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీయస్, వేణుమాధవ్, మల్లికార్జున రావు, తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి, సీవీఎల్ నరసింహారావు, కృష్ణ భగవాన్, మాస్టర్ భరత్, ఆహుతి ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సుమన్ అతిథిగా కనిపించగా.. రాశి ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలకి సాహితి సాహిత్యమందించారు. ``గోంగూర తోట కాడ``, ``మాస్ తో పెట్టుకుంటే``, ``అందాల చుక్కల లేడి``, ``అనగనగా కథలా``, ``మార్ మార్``, ``ఓ మనసా``.. ఇలా ఇందులోని పాటలన్నీ మాస్ ని ఎంటర్టైన్ చేశాయి. లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన `వెంకీ`.. 2004 మార్చి 26న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ సినిమా 18 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |